- ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఆరోపణ
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ఓటరు జాబితా అధికార పార్టీ నేతల కారణంగానే తప్పులతడకగా మారిందని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ ఆరోపించారు. ఇష్టారాజ్యంగా రూపొందించిన ఓటర్ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు సోమవారం ఖానాపూర్ లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్‌తో కలిసి మాట్లాడారు. ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డులకు సంబంధం లేని ఓట్లను ఇక్కడ చేర్చారని ఆరోపించారు.
ఇక్కడ నివాసం ఉండని వారి ఓట్లు నమోదు కావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఓటర్ లిస్టును ఆధికారులు కాంగ్రెస్ నేతల సూచన మేరకు తయారు చేసి, వారికి లబ్ధిచేసేచర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుల తడకగా ఉన్న ముసాయిదా ఓటర్ లిస్టును సరి చేయక పోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిర్మ ల్, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కూడా ఓటర్ లిస్టు సక్రమంగా లేదన్నారు.
ఖానాపూర్ మున్సిపల్ లో బీజేపీ గెలుపు ఖాయం
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని ఎంపీ నగేశ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో 4వ వార్డుకు చెందిన 250 మంది యువకులు, మహిళలు నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ అంకం మహేందర్, పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి నందిరామయ్య, ఎంఐఎం మండల అధ్యక్ష, కార్యదర్శులు అఖిల్, అఫ్సర్ ఖాన్, నాయకులు సురేందర్, కస్తూరి మహేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
