కాగజ్ నగర్, వెలుగు: సర్కార్ బడుల్లో పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్డీఈవో దీపక్ తివారీ ఆదేశించారు. సోమవారం కౌటాల మండలం బోదంపల్లి జడ్పీ స్కూల్, మండల కేంద్రంలోని శ్యాం మోడల్ ప్రైవేట్ స్కూల్, బెజ్జూరులోని ఓవర్కమ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కాగజ్ నగర్ పట్టణంలోని పలు ప్రైవేట్స్కూళ్లను వారు తనిఖీ చేశారు.
విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు పరిశీలించారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన టీచర్లతో విద్యాబోధన చేస్తున్నామన్నారు. అప్గ్రేడ్ కోసం దరఖాస్తు చేసిన ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండాలని సూచించారు. ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవోలు హన్మంతు, ప్రభాకర్ తదితరులున్నారు.
