- ప్రజావాణిలో కలెక్టర్లు
నస్పూర్/ఆసిఫాబాద్/ఆదిలాబాద్టౌన్/ నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. హైటెక్ సిటీ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంచిర్యాలలోని 29వ వార్డులో విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్ పరికరాల రిపేర్లు, గ్రీన్ మ్యాట్, టాయ్లెట్స్, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దరఖాస్తులు అందించారు.
తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని విచారించి న్యాయం చేయాలని, తన ఇంటికి రాకపోకలు సాగించే దారిని కొందరు ఉద్దేశం పూర్వకంగా మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని, తన భర్త, కొడుకు చనిపోయారని తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని దరఖాస్తులు అందజేశారు.
పరిష్కరించడంలో జాప్యం వద్దు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. రెబ్బెన మండలం నారాయణపూర్ శివారులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తన పట్టా భూమికి కొలతలు చేసి హద్దులు నిర్ధారించాలని, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ చనిపోయిన తన కొడుకు బీమా డబ్బులు ఇప్పించాలని, భూమిని ఆన్ లైన్ లో ఎక్కించాలని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ ప్రజలు దరఖాస్తులు అందజేశారు.
ప్రజావాణికి 103 దరఖాస్తులు
ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 103 దరఖాస్తులు వచ్చాయి. అడిషనల్కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి శాఖల వారీగా సమీక్షించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ట్రైనీ కలెక్టర్ సలోని చబ్ర, అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
నిర్మల్కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్దరఖాస్తులు స్వీకరించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి పిల్లలకు కల్పిస్తున్న వసతులు, తదితర వివరాలను పొందుపరచాలన్నారు.
జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈ నెల 31 వరకు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎస్సీ విద్యార్థులకు అందించే ఉపకారవేతనాలకు సంబంధించి వాల్పోస్టర్లను అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
