కలెక్టర్ రాహుల్ రాజ్ సరికొత్త ఆలోచన..బొకేలు, శాలువాలకు బదులు బ్లాంకెట్లు..సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పంపిణీ

కలెక్టర్ రాహుల్ రాజ్ సరికొత్త ఆలోచన..బొకేలు, శాలువాలకు బదులు బ్లాంకెట్లు..సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పంపిణీ

మెదక్, వెలుగు:  కొత్త సంవత్సరం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థలు, సంఘాల బాధ్యులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి విషెస్​తెలపడం, శాలువాలతో సన్మానించడం  తెలిసిందే. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనకు విషెస్ ​చెప్పేందుకు వచ్చేవారు పుష్ప గుచ్చాలు, శాలువాలు తీసుకురాకుండా వాటికి బదులు బ్లాంకెట్లు  తీసుకురావాలని సూచించారు. ఆయన సూచనను చాలా మంది పాటించి ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బ్లాంకెట్లు తీసుకు వచ్చి అందజేస్తున్నారు. 

ఇలా ఇప్పటి వరకు వెయ్యికి పైగా బ్లాంకెట్లు సమకూరాయి. జిల్లాలోని బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటున్న సుమారు 2,500 మంది విద్యార్థులకు బ్లాంకెట్లు అవసరం ఉన్నాయని గుర్తించారు. అందులో కొందరు విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం మొదలెట్టారు. రామాయంపేట హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా బ్లాంకెట్లు అందజేశారు. 

రెండు, మూడేళ్ల వరకు ఇబ్బంది ఉండదు:  కలెక్టర్​ రాహుల్​రాజ్

చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నా. అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఎవరికి తోచిన విధంగా వారు బ్లాంకెట్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు సమకూరినవి కాకుండా మరిన్ని బ్లాంకెట్లు వచ్చే అవకాశం ఉంది.  రెండు, మూడేళ్ల వరకు విద్యార్థులకు బ్లాంకెట్లు ఉపయోగపడతాయి.