నిజామాబాద్ జిల్లాలో యాసంగికి సరిపడా యూరియా : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లాలో యాసంగికి సరిపడా యూరియా : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్,  వెలుగు:  జిల్లాలో యాసంగి సీజన్​కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్​ ఇలా త్రిపాఠి తెలిపారు.  సోమవారం ఆమె డీసీసీబీ బ్యాంక్ మీటింగ్ హాల్​లో జిల్లా లెవల్ టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావొద్దన్నారు. పంటలకు కావాల్సిన యూరియా మొత్తాన్ని సరఫరా చేసే బాధ్యత తమదేనని,  పంటలకు అవసరానికి మించి యూరియా చల్లొద్దన్నారు.

 యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్​, దళారుల ప్రమేయాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం తెచ్చిన యాప్​ రైతులు ఉపయోగించుకునేలా చూడాలన్నారు. అభ్యుదయ రైతుల సేవలు ఇందుకోసం వాడుకోవాలన్నారు.  ఆధునిక వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, పసుపు సాగుకు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు. 

ఖర్చులు తగ్గేలా యంత్రసామగ్రి సరఫరా అయ్యేట్లు చొరవ చూపాలన్నారు. పంటల సాగులో జిల్లాకు ఉన్న పేరు మరింత పెరిగేలా యంత్రాంగం కోఆర్డినేషన్​తో పని చేయాలన్నారు. డీసీసీబీ జీఎం అనుపమ, సీఈవో నాగభూషణం, లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ సునీల్​ ఉమ్మడి జిల్లాకు చెందిన అగ్రికల్చర్​, హార్టికల్చర్​, మత్స్య శాఖ అధికారులు హాజరయ్యారు.