ఈ డాక్టర్​  సాగు చేస్తుండు 

ఈ డాక్టర్​  సాగు చేస్తుండు 

ఆయనొక డాక్టర్​. కానీ, మిగతా డాక్టర్స్​లా జబ్బులకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. వాటి వెనకున్న కారణాల్ని రీసెర్చ్​ చేస్తున్నారు. ఆ సమస్య మరొకరికి రాకూడదని ఆరాటపడుతున్నారు. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మిగతా రైతుల్ని  తన బాటలో నడిపిస్తున్నారు.  ఎందరికో ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్న ఆయన​ పేరు తిప్పని సుధాకర్​.  హనుమకొండ​ జిల్లా, భీమదేవరపల్లి మండలం, ములక నూర్​​లోని నర్సింగ్ హోంలో డాక్టర్​గా పనిచేస్తున్నారాయన. ములకనూర్​ నర్సింగ్​ హోం​ చుట్టు పక్కల గ్రామాల్లో, జిల్లాల్లో  డాక్టర్​గా​ మంచి పేరు ఉంది సుధాకర్​కి. అయితే నాలుగేళ్ల కిందట తన దగ్గరికొచ్చే పేషెంట్స్​ సమస్యలన్నింటికీ కెమికల్స్​తో నిండిన ఫుడ్డే కారణం అనిపించింది ఆయనకు. అంతే మరో ఆలోచన లేకుండా తనకున్న పన్నెండు ఎకరాల్లో  రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయాలనుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని రైతుల్ని సేంద్రియ సాగు వైపు నడిపించాలని డిసైడ్‌ అయ్యారు.  అందుకోసం అప్పటికే సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్న  పడాల గౌతమ్, కర్రె మురళి సాయం తీసుకున్నారు. బియ్యం మొదలు  అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు సుధాకర్. అరటి, పనస, సీతాఫలం లాంటి పండ్లతో పాటు కంది, పెసర,పల్లీ కూడా పొలంలోనే పండిస్తున్నారు. ఫామ్​లోనే నాటు కోళ్లు, ఆవులు కూడా పెంచుతున్నారు. ఆవుల పాలను హాస్పిటల్​ స్టాఫ్‌కి, పేషెంట్స్​కి ఇస్తున్నారు. వాటి  పెంటతో వర్మి కంపోస్ట్​ చేసి పంటలకి ఎరువుగా వేస్తున్నాడు. పాలేకర్, సివిఆర్​ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ తోటి రైతులకి అవగాహన కల్పిస్తున్నాడు. తన ఫామ్​లోనే గానుగ మిషన్​తో  నూనె తీస్తూ మిగిలిన చెక్కను పశువులకు దాణాగా వేస్తున్నారు.
                                                                                                                                                                                                                           ::: భీమదేవరపల్లి, వెలుగు