నీడిల్‌‌తో అరుదైన సర్జరీ.. ఇండియాలో తొలిసారి చేశామంటున్న సన్ షైన్ డాక్టర్లు

నీడిల్‌‌తో అరుదైన సర్జరీ.. ఇండియాలో తొలిసారి చేశామంటున్న సన్ షైన్ డాక్టర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: భుజం ఎముక గాయానికి ఒక చిన్న సూది వంటి పరికరంతో సర్జరీ చేసి సన్‌‌షైన్ హాస్పిటల్ డాక్టర్లు ఔరా అనిపించారు. ఈ తరహా ఆపరేషన్లకు ఆర్థ్రోస్కోపిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో పేషెంట్‌‌కు మత్తు ఇచ్చి, భుజం వద్ద కొంత స్కిన్‌‌ను కట్ చేసి సర్జరీ చేస్తారు. పేషెంట్ కనీసం 3 రోజులు హాస్పిటల్‌‌లోనే ఉండాల్సి వస్తుంది. ఇలా కాకుండా పేషెంట్‌‌కు ఇబ్బంది లేకుండా నానో నీడిల్‌‌ స్కోప్‌‌ను విదేశీ డాక్టర్లు రెండేండ్ల కిందట అభివృద్ధి చేశారు. ఈ నీడిల్ స్కోప్‌‌ను సన్‌‌షైన్ హాస్పిటల్‌‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నీడిల్ స్కోప్‌‌ను ఉపయోగించి డాక్టర్ బి. చంద్రశేఖర్ బృందం శుక్రవారం తొలి సర్జరీ చేసింది. 

ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇండియాలో నీడిల్‌‌ స్కోప్‌‌ను ఉపయోగించి చేసిన తొలి సర్జరీ ఇదేనని తెలిపారు. లోకల్ అనస్తీషియా(గాయం అయిన భాగంలో) మాత్రమే ఇచ్చి షోల్డర్ రొటేటర్ కఫ్‌‌ను రిపేర్ చేశామని ఆయన తెలిపారు. 1.9 మిల్లీ మీటర్ల పొడవు మాత్రమే ఈ నీడిల్ ఉంటుందని, నీడిల్ చివరన ఉండే కెమెరా సాయంతో గాయమైన భాగాన్ని కంప్యూటర్‌‌‌‌లో చూస్తూ సర్జరీ పూర్తి చేశామన్నారు. నీడిల్ స్కోప్‌‌ వాడటం వల్ల భుజానికి ఎలాంటి గాట్లు పెట్టాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ తరహా ఆపరేషన్లలో పేషెంట్‌‌కు నొప్పి తక్కువగా ఉంటుందని, ఆపరేషన్ జరిగిన రోజే డిశ్చార్జ్‌‌ కావొచ్చని తెలిపారు. ఈ నీడిల్ నానో స్కోప్‌‌తో మజిల్ టెయిర్స్‌‌ రిపేర్‌‌‌‌, లీగమెంట్‌‌ డ్యామేజ్ రిపేర్‌‌‌‌, షోల్డర్‌‌‌‌ రిప్లేస్‌‌మెంట్ వంటి సర్జరీలు చేయొచ్చునని చంద్రశేఖర్ వివరించారు.