ఫండ్స్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు : బక్కి వెంకటయ్య

ఫండ్స్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు : బక్కి వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య

సంగారెడ్డి, వెలుగు: అట్రాసిటీ కేసులు, పోలీస్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్  చైర్మన్  బక్కి వెంకటయ్య ఆదేశించారు. జాప్యం చేసినట్లు తన దృష్టికి వస్తే ఊరుకునేది లేదన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ సబ్  ప్లాన్  కింద వివిధ శాఖల ద్వారా ఖర్చు చేస్తున్న ఫండ్స్, తదితర అంశాలపై జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్  ప్లాన్  నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, పదోన్నతులు, రోస్టర్  అమలులో అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. పెండింగ్‌‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

 అనంతరం పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన 10 మంది ఎస్సీ రైతులకు డ్రాఫ్ట్  పాస్‌‌బుక్‌‌లను అందజేశారు. కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్ల శంకర్, అడిషనల్​ కలెక్టర్లు మాధురి, పాండు, అడిషనల్​ ఎస్పీ రఘునందన్ రావు, సోషల్​ వెల్ఫేర్​ డీడీ అఖిలేశ్ రెడ్డి పాల్గొన్నారు.