- నగరాలు, పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం
- మహబూబ్నగర్కార్పొరేషన్లో
- ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన కాంగ్రెస్
- ఫైనల్ లిస్ట్ తయారీకి కమిటీ ఏర్పాటు చేసిన డీసీసీ
- ముందస్తుగా బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు
- అధికార పార్టీని దెబ్బ తీసేందుకు తెరవెనుక ఒప్పందం?
మహబూబ్నగర్, వెలుగు : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా రాష్ర్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలు కేడర్‌ను అలర్ట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు తదితర అంశాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నాయి.
ఈ తరుణంలో నగరాలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎలాగైనా మెజార్టీ మున్సిపాల్టీలు, డివిజన్లను కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీలు తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నట్లు సమాచారం.
ఆశావహుల నుంచి అప్లికేషన్..
కార్పొరేషన్లో మెజార్టీ డివిజన్లను కైవసం చేసుకొని మేయర్‌పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీ ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఆయా డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కమిటీని ఏర్పాటు చేశారు. పోటీకి ఆసక్తి ఉన్న వారు డీసీసీ ఆఫీస్‌లో ఈ కమిటీని అప్లికేషన్లు ఇవ్వాలని సూచనలు చేశారు.
వచ్చిన అప్లికేషన్లను కమిటీ ఫీల్డ్ సర్వే చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సర్వేలో ప్రజలు ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో వారికే పార్టీ నుంచి బీపామ్ఇప్పించనున్నట్లు తెలిసింది. అలాగే పోటీకి ఇంట్రెస్ట్చూయించే సీనియర్ లీడర్లకు కూడా ప్రియారిటీ ఇస్తున్నట్లు సమాచారం. కాగా.. సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా జాబితా తయారు చేసి హైకమాండ్‌కు పంపించనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇందులో భాగంగానే ఎన్నికల్లో పార్టీ బీఫామ్‌తో పోటీ చేసే ప్రతి క్యాండిడేట్‌కు కార్యకర్తలు అండగా నిలబడాలని డీసీసీ నుంచి సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు కార్పొరేషన్పరిధిలోని పార్టీ కేడర్‌తో డీసీసీ అధ్యక్షుడితోపాటు మరికొందరు జిల్లా లీడర్లు సమావేశమై వారికి దిశానిర్దేశం
చేశారు.
బీజేపీ కేడర్‌కు దిశానిర్దేశం..
ఇటీవల బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. మహబూబ్నగర్ ఎంపీగా డీకే అరుణ ఉండడంతో పాలమూరు కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని మేయర్‌పీఠంపై బీజేపీ జెండాను ఎగుర వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ముందస్తుగా కేడర్‌తో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్, మున్సిపల్ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేడర్ సిద్ధంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీమ్ వర్క్ చేయాలని స్పష్టం చేశారు. పార్టీ సింబల్స్ మీద జరిగే ఎన్నికలు కావడంతో ఎవరైనా పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికార పార్టీని దెబ్బతీసేందుకు తెరవెనుక రాజకీయం..
ఉమ్మడి పాలమూరుజిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్‌తోపాటు మరో 18 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ఓటరు లిస్టును ఇటీవల రిలీజ్ చేయగా, తాజాగా ఆల్‌పార్టీ మీటింగ్‌ను కూడా పూర్తి చేసింది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రేడ్–1గా ఉన్న పాలమూరు మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీని గట్టి దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మెజార్టీ స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఓ ప్రధాన పార్టీతోపాటు మరో పార్టీకి చెందిన లీడర్లు లోపాయికారి ఒప్పందాలకు దిగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
