సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ బాలింత ప్రాణాల మీదకు తెచ్చింది. ఆపరేషన్ చేసి కడుపులోనే దూది (కాటన్) మరిచిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే.? రామయంపేటకు చెందిన నందిని అనే మహిళ.. ఏప్రిల్ 14న కాన్పు కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అవుతుండటంతో.. అక్కడి లేడీ డాక్టర్ కడుపులో కాటన్ పెట్టారు. ఆ తర్వాత ఆ కాటన్‌ను తీయడం మరచిపోయి నిర్లక్ష్యంగా కుట్లు వేశారు.
వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా.. దాదాపు నెల రోజుల పాటు ఆ కాటన్ కడుపులోనే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్రంగా ఇన్ఫెక్షన్‌కు గురైంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో నరకయాతన అనుభవించిన బాధితురాలు.. తట్టుకోలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. కడుపులో కాటన్ ఉండిపోవడం వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పడంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నందిని,ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు. ప్రభుత్వ వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి సిబ్బందిని నిలదీస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన వైద్యులపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
