- సీఎం కసీఆర్ కు 50 మంది డాక్టర్లు, ఐఏఎస్ లు, లాయర్ల లెటర్లు
- కరెక్ట్‌గా చెప్తేనే కేంద్రం, ప్రైవేట్ సంస్థలు సాయం చేస్తాయని కామెంట్
- ఎక్కువ చార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
- ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలె
- ఆఫీసులు, ఇండ్ల వద్దే టీకాలు వేయాలి
- కరోనా మహమ్మారి కట్టడికి 20 పాయింట్లు సూచించిన డాక్టర్లు
కరోనా కేసులు, మరణాల వివరాలను ఎలాంటి ఉన్నవి ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని 50 మందితో కూడిన డాక్టర్లు, ఐఏఎస్‌లు, లాయర్ల బృందం కోరింది. అన్ని వివరాలను కరెక్ట్‌గా వెల్లడిస్తే కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు సాయం చేయడానికి వీలవుతుందని చెప్పారు. కరోనా బులెటిన్‌లో లెక్కలు తప్పుగా చూపిస్తున్నారని, ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సరైన లెక్కలు వెల్లడించాలని సూచించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తూ ఆదివారం వాళ్లు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 20 పాయింట్ల ఫార్ములాను సూచించారు. కరోనా మీదే ఫోకస్ పెట్టి మిగతా పేషెంట్లను వదిలేయొద్దని, వారికీ ట్రీట్మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రులను పూర్తిగా కరోనాకే కేటాయించడం వల్ల.. వేరే జబ్బులున్నోళ్లకు ముప్పు కలుగుతుందన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా అన్ని ప్లాంట్లనూ ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని, అందుకు ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానలు అధిక చార్జీలు వసూలు చేయకుండా ఓ లీగల్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ‘ప్యాండెమిక్ అప్డేట్’ పేరిట మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆళ్లపాటి నేతృత్వంలోని నిపుణులు సూచించారు.
డాక్టర్ల బృందం సూచించిన 20 పాయింట్లు ఇవీ..
1కరోనా ట్రీట్మెంట్లో వాడే మందులు, వైద్య పరికరాల తయారీకి వాడే ముడి సరుకు, వాటి ప్యాకింగ్ మెటీరియల్, తయారైన వాటి రవాణాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, అత్యవసరమైన మందులు సమయానికి అందేలా విపత్తు నిర్వహణ చట్టాన్ని ప్రయోగించాలి.
2ఎన్95 లేదా దానికి సమానమైన మాస్కులనే వాడేలా చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేని మాస్కులపై నిషేధం విధించాలి. పేదలకు ప్రభుత్వమే ఎన్95 మాస్కులను అందించాలి. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని రోజూ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి.
3రెమ్డెసివిర్, టొసిలిజుమాబ్ వంటి ఎమర్జెన్సీ మందులు బ్లాక్ మార్కెట్ కాకుండా, వాటి ధరలు పెరగనివ్వకుండా చూడాలి. అందుకు కరోనా ఆసుపత్రుల్లోని మెడికల్ షాపుల్లోనే ఆ మందులు దొరికేలా, ఇన్‌పేషెంట్లకే వాడేలా చర్యలు చేపట్టాలి.
4రాష్ట్రంలోని అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలి. ఒకే ఒక వ్యవస్థ ద్వారా అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను చేయాలి. రూమ్ ఎయిర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి ఆక్సిజన్ వనరులపై దృష్టి పెట్టాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాటిని అమ్మేలా నియంత్రణ విధించాలి. ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు కమ్యూనిటీ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న వారికి ఆయా సెంటర్లలోనే ఆక్సిజన్ వసతులను కల్పించాలి.
5హెల్త్ స్టాఫ్ కొరత రాకుండా వేరే వనరులపై ఇప్పుడే ఆలోచన చేయాలి. ఎమర్జెన్సీ ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఈవోసీ)ను ఏర్పాటు చేసి.. కరోనా తీవ్రతకు తగ్గట్టు హెల్త్ స్టాఫ్‌ను నియమించాలి. టెలీ హెల్త్/టెలీ మెడిసిన్‌ను ప్రమోట్ చేస్తూనే అవసరమైనప్పుడు పేషెంట్‌ను చెక్ చేసేందుకు చర్యలు చేపట్టాలి. వృద్ధులకు ప్రత్యేకంగా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. జనాల్లో కరోనా భయం పోగొట్టేలా టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తేవాలి. తక్కువ లక్షణాలున్న వారికి టెలీమెడిసిన్ ద్వారానే ట్రీట్మెంట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను తట్టుకునేలా డీఆర్డీవో వంటి సంస్థల సాయం తీసుకుని బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల సౌలతులతో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కృషి చేయాలి.
6ఆర్టీపీసీఆర్ టెస్టుల రిపోర్టులను వేగంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలి.
7ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగానే ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు. వారికి ఉన్న తీవ్రత, అవసరాన్ని బట్టి ఆసుపత్రుల్లో చేర్చుకోవాలి. వివిధ ఆసుపత్రులకు ఉన్న మెడికల్ కాలేజీల్లో ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయాలి.
8టెస్టులు, పాజిటివ్ కేసులు, మరణాలు, యాక్టివ్ కేసులు, డిశ్చార్జి అయిన వారి వివరాలను కరెక్ట్‌గా వెల్లడించాలి. ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలిపే డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలి.
9లక్షణాలు తక్కువగా ఉన్నోళ్లకు, లక్షణాల్లేని వాళ్లను హోం ఐసోలేషన్‌లోనే పెట్టి అవసరమైన సాయం చేయాలి. ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలి. వారితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి. ఎప్పుడు ఆసుపత్రికి రావాలో వివరించి చెప్పాలి. దాని వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది.
10వ్యాక్సిన్ల సమీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తేసినందున.. మన డిమాండ్‌కు తగ్గట్టు వ్యాక్సిన్లకు ముందే ఆర్డర్ పెట్టాలి. వ్యాక్సిన్ల ధరలను పక్కాగా నియంత్రించాలి. థర్డ్ పార్టీలు, దళారులు ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి.
11ఒక్కసారి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. ఆఫీసులు, నివాస ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి. దాని వల్ల రద్దీ తగ్గుతుంది. పెద్ద వయసు వాళ్లకు ప్రయాణ భారం పోతుంది. కరోనా తీవ్రత దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను 24 గంటల పాటు కొనసాగించాలి.
12కరోనా మీద ఫోకస్ పెట్టి ఇతర సమస్యలున్న వారి ఆరోగ్యాన్ని మరువొద్దు. దాని వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆసుపత్రులను కరోనా ట్రీట్మెంట్కే పరిమితం చేయకుండా నాన్ కరోనా పేషెంట్లకూ ట్రీట్మెంట్ కూడా అందించాలి.
13గ్రామీణ ప్రాంతాల వారికీ కరోనా ట్రీట్మెంట్ అందించేలా టెలీమెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. ట్రీట్మెంట్ కోసం సిటీల దాకా రాలేని వాళ్లకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
14కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు ఇన్సెంటివ్‌లను అందించాలి. వారు అలసిపోకుండా సరిపోయేంత బ్రేక్ టైం ఇవ్వాలి. హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం సరైన గౌరవం, విశ్రాంతి, జీతం, పూర్తి వైద్య/లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఇస్తే ఎస్మా ప్రయోగాల అవసరం రాదు.
15కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం పెట్టిన ధరల కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఓ లీగల్ కమిటీని ఏర్పాటు చేయాలి. అయితే, కొన్ని ఆసుపత్రులు మంచి చేస్తున్నా, చివరి దాకా కరోనా పేషెంట్లను బతికించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆప్తులను కోల్పోయిన బాధలో కొందరు ఆ ఆసుపత్రులపై దాడులకు దిగుతున్నారు. అలాంటివి జరగకుండా జ్యుడీషియరీ, లా ఎన్ఫోర్స్మెంట్ కమిటీలను వేయాలి. మహమ్మారిపై కొందరు రాజకీయాలు చేస్తూ డాక్టర్లు, ఆసుపత్రి ఓనర్లు, పోలీసులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలను బ్లేమ్ చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
16అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మృతదేహాల డిస్పోజల్‌కు సంబంధించి ప్రొటోకాల్స్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల నుంచి ఇళ్లు, శ్మశానాలకు తీసుకెళ్లేటప్పుడు ప్రొటోకాల్‌ను పాటించేలా చూడాలి.
17ప్లాస్మా దానం, వాటి స్టోరేజీ, అందుబాటులో ఉన్న ప్లాస్మా దాతలకు సంబంధించిన వివరాలను సెంట్రలైజ్ చేయాలి. అన్నింటికీ ఒకే ఒక్క హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో దానిని నిర్వహించాలి.
18కొత్త వేరియంట్ల గురించి తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను మరింత ఎక్కువగా జీనోమ్ సీక్వెన్స్‌లు చేయాలి. థర్డ్‌వేవ్‌లో కొత్త వేరియంట్ల ఆటకట్టించేందుకు కొత్త వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు అది ఉపయోగపడుతుంది. కొత్త ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తయారు చేయడానికి పనికొస్తుంది.
19డిమాండ్‌కు తగ్గట్టు వ్యాక్సిన్ల తయారీని వేగవంతం చేయాలి. కొత్త టీకాలు, మందులకు సంబంధించి పేటెంట్, కాపీరైట్, ఇండస్ట్రియల్ డిజైన్స్ వంటి వాటిని రద్దు చేయాలి. కంపల్సరీ లైసెన్సింగ్ రూల్స్‌ను తీసేస్తే వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
20ప్యాండెమిక్ అప్డేట్ పేరుతో ప్రతిరోజూ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుండాలి. లెక్కలను కరెక్ట్‌గా వెల్లడిస్తే ఎన్జీవోలు, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు తమకు తోచిన సాయం చేస్తాయి.
