వామ్మో.. మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

వామ్మో.. మహిళ కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.  ఓ మహిళ కడుపులోంచి 2.5 కిలోల వెంట్రుకలను వైద్యులు తొలగించారు.  25 ఏళ్ల ఓ మహిళ గర్భధారణ సమయంలో వెంట్రుకలను తినడం అలవాటును పెంచుకుంది.  ఆమె తన వెంట్రుకలతో పాటు ఇతరుల వెంట్రుకలను కూడా తినేది. ప్రసవించిన తరువాత మాత్రం వాటిని  తినడం మానేసింది. కానీ ఆమెకు కడుపు నొప్పి రావడం స్టార్ట్ అయింది.  దీంతో ఆమె ఏమీ తినలేకపోయింది. 

నిరంతర వాంతులు వచ్చేవి. ఈ క్రమంలో మహిళ కుటుంబ సభ్యులు  ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అక్కడ ఆమెకు మొదట ఇచ్చిన మందుల వలన ఎటువంటి ఉపశమనం కలిగించలేదు. దీంతో  ఆమెను చిత్రకూట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, కడుపు నొప్పికి కారణాన్ని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. వెంట్రుకలు తినే అలవాటు వల్ల ఆ స్త్రీ కడుపు పూర్తిగా వెంట్రుకలతో నిండిపోయిందని వైద్యులు నిర్థారించారు. 

డాక్టర్ నిర్మలా గెహానీ ప్రకారం, మహిళ అటువంటి పరిస్థితిలో ఇంకొన్ని రోజులు ఉంటే మరణించి ఉండవచ్చని తెలిపారు.  దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ అనంతరం మహిళ కడుపులో నుంచి రెండున్నర కిలోల బరువున్న జుట్టును బయటకు తీశారు వైద్యులు.  డాక్టర్ నిర్మలా చెప్పిన వివరాల ప్రకారం, మహిళ ట్రైకోఫాగియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని చెప్పారు. ఈ వ్యాధితో బాధపడే వారు ఎవరైనా పదేపదే తింటారని...  ఇది పోషకాహార లోపమని.. జీర్ణవ్యవస్థలో అడ్డంకులతో పాటుగా సహా అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దారితీసే తీవ్రమైన పరిస్థితి వస్తుందని తెలిపారు.