
హైదరాబాద్, వెలుగు : ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేసే టైమ్ ఉన్న సీఎం కేసీఆర్‌కు టెన్త్ పేపర్ లీకేజీపై రివ్యూ చేసే సమయం లేదా? అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఐటీ హబ్ అని గొప్పగా చెప్పుకునే మంత్రి కేటీఆర్.. ఈ ప్రశ్నపత్రాల లీకేజీతో ఐటీ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర మంత్రులు దద్దమ్మలుగా, రబ్బర్ స్టాంపులుగా మారిపోయారని, అందుకే ఈ లీకేజీలని మండిపడ్డారు.
మోడీ సభకు జన సమీకరణపై ఫోకస్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోడీ సభకు జన సమీకరణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మోడీ బహిరంగ సభకు హాజరవుతారు. హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని సభకు తరలించడంపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. సిటీలో బీజేపీ కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. సిటీ బీజేపీ నేతలతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సోమవారం సాయంత్రం పార్టీ స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఇందులో లక్ష్మణ్ తో పాటు పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, రవీంద్ర నాయక్, చింతల రాంచంద్రారెడ్డి, ప్రదీప్ రావు, పలువురు సిటీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
లోక్ సత్తా చీఫ్‌తో భేటీ
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్‌తో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ భేటీ అయ్యారు. సోమవారం ఉదయం జేపీ ఇంటికి వెళ్లిన లక్ష్మణ్ఆయనతో రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మణ్ ట్విట్టర్లో వెల్లడించారు. మోడీ తెలంగాణ టూర్ ఖరారైన సమయంలో ఈ ఇద్దరు నేతల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి కమ్మ సామాజికవర్గం మద్దతు లభించేలా చేయడంలో భాగంగానే జేపీని లక్ష్మణ్ కలిశారా లేక లోక్ సత్తాను బీజేపీలో విలీనం చేయాలని కోరేందుకా..అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడిగా సాగుతోంది.