కేసీఆర్ కిట్టు.. క్యాష్ కట్టు

కేసీఆర్ కిట్టు.. క్యాష్ కట్టు
  • పైసల కోసం లక్ష మందికిపైగా ఎదురుచూపులు
  • అయిదు నెలలుగా ఆగిన చెల్లింపులు
  • పెరుగుతున్న పెండింగ్జాబితా
  • చాలా జిల్లాల్లో తొలి విడత డబ్బులే ఇవ్వలేదు
  • మిగతా మూడు విడతల్లోనూ అరకొరే

కేసీఆర్ కిట్.. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు పేరిట రాష్ట్రంలో అమలవుతున్న ఈ స్కీమ్‌కు వెయిటింగ్ లిస్టు మొదలైంది. పుట్టిన బేబీకి కేసీఆర్ కిట్లు ముట్టజెప్పిన ప్రభుత్వం.. తల్లులకు ఇచ్చే పైసలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. గత ఏడాదంతా పక్కాగా అమలైన కేసీఆర్​ కిట్​పథకం.. ఎన్నికల సీజన్ మొదలయ్యాక అవస్థలు పడుతోంది. నాలుగు విడతల్లో పైసలు ఇవ్వాల్సి ఉన్నా.. ప్రతి విడతలోనూ పెండింగ్‌లే కన్పిస్తున్నాయి. ఐదు నెలల నుంచి దాదాపు అన్ని జిల్లాల్లో పేమెంట్లు నిలిచిపోయాయి. అధికారుల రిపోర్టుల ప్రకారమే రాష్ట్రమంతటా లక్ష మందికి పైగా డబ్బులందలేదు. నాలుగు విడతల్లో ఇవ్వాల్సిన పేమెంట్లు కొందరికి మొదటి విడతతోనే ఆగిపోయాయి. ఇలా మొత్తం దాదాపు 2.99 లక్షల పేమెంట్లు ఆగిపోయాయి. కేసీఆర్ కిట్ మాత్రమే చేతికిచ్చారని, ఇప్పటివరకు ఒక్క పైసా తమ ఖాతాలో వేయలేదని అనేక మంది లబ్ధిదారులు చెబుతున్నారు.

విడతల వారీగా పెండింగ్

ఈ స్కీంలో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో పుట్టిన బేబీకి కేసీఆర్ కిట్‌ను కానుకగా అందిస్తారు. అందులో రెండు జతల బట్టలు, బేబీ సోప్, బేబీ ఆయిల్, నాప్కిన్‍లు, అంబ్రెల్లా, మ్యాట్‍లు.. మొత్తం16 రకాల వస్తువులుంటాయి. పాప పుడితే ఈ కిట్‌తోపాటు రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలు ప్రభుత్వం ఇన్సెంటివ్​గా అందజేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరి అయిన వారికి, మొదటి రెండు కాన్పులకే పథకం వర్తిస్తుంది. గర్భిణులు సబ్ సెంటర్లో తమ పేర్లు నమోదు చేసుకున్నప్పుడే తొలి విడతగా రూ.3 వేలు జమ చేస్తారు. డెలివరీ అయ్యాక బాబు పుడితే రూ.4 వేలు, పాప పుడితే రూ.5 వేలు అందిస్తారు. మూడున్నర నెలలకు ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు వేయిస్తే.. రూ.2 వేలు, తొమ్మిది నెలల పాపకు విటమిన్​ఏ ఇచ్చేటప్పడు చివరి విడతగా రూ.3 వేలు అందిస్తారు. మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయాలి. కానీ చాలా జిల్లాల్లో తొలి విడత కింద ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. రెండో విడతలోనూ పెండింగ్​లో పెట్టారు. మూడు, నాలుగు విడతల్లోనూ అరకొర పైసలే ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరికెంత ఇచ్చారు.. ఎన్ని విడతల్లో చెల్లించారన్నదానిపై గందరగోళం నెలకొంది. మారుమూలన ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో దాదాపు 900 మంది బాలింతలకు నగదు చెల్లింపులు ఆగిపోయాయి.

ఎన్నికల నుంచి బ్రేకులు

ముందస్తు ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు నుంచి డిసెంబర్‌‌‌‌ వరకు ఈ స్కీమ్​కు బడ్జెట్​ నుంచి నిధులు విడుదల చేయలేదు. ఎన్నికలయ్యాక కొన్ని డబ్బులివ్వడంతో గతేడాది ఏడాది అక్టోబరు వరకు అర్హులైన బాలింతల ఖాతాల్లో పైసలు జమయ్యాయి. మళ్లీ నవంబరు నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో డెలివరీ చేయించుకున్న బాలింతలకు ఇన్సెంటివ్​ల చెల్లింపు సవ్యంగా సాగలేదు. తమ దగ్గరేమీ లేదని, బడ్జెట్ రాగానే డబ్బులిస్తామని కొన్ని జిల్లాల అధికారులు చెబుతున్నారు.

మచ్చుకు జిల్లాల వారీగా

  •  ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వారికి రెండో విడతలో 3,134 మందికి ఇన్సెంటివ్ ఇవ్వలేదు. మూడున్నర నెలల టైమ్​లో మూడో విడతగా 5,213 మందికి, 9 నెలల తర్వాత ఇచ్చే అమౌంట్ 652 మందికి పెండింగ్​లో పడింది. ఆధార్​నంబర్ తప్పుగా ఉండడం, బ్యాంక్ అకౌంట్ నంబర్ ట్యాలీ కాకపోవడం, అకౌంట్ ఇన్ ఆపరేటివ్ గా ఉండటంతో నిధులు ఆగిపోయాయని ఇక్కడి అధికారులు
    చెబుతున్నారు.
  • అసిఫాబాద్​ జిల్లాలో ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2019 వరకు 4,430 మంది సర్కార్ దవాఖానలో డెలివరీ అయ్యారు. వారిలో 1,390 మందికి పైసలు ఇంకా అందలేదు. గత నాలుగు నెలల నుంచి ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడం లేదు.
  • నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు సివిల్ ఆస్పత్రులు, 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో 21,433 మహిళలకు సాధారణ కాన్పులు జరిగితే అర్హులైన 9,149 మందికి బేబీ కిట్ అందించారు. 7,076 మందికి నగదు చెల్లించారు. ఇంకా 2,427 మందికి గత మూడు నెలల నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి.
  •  జనగామ జిల్లా కేంద్రం శివారులోని ఎంసీహెచ్‌‌‌‌(మాతా శిశు ఆస్పత్రి)లో 1,388 మందికి నగదు సాయం పెండింగ్‌‌‌‌లో ఉంది. జిల్లాలోని 13 పీహెచ్‌‌‌‌సీలు, ఒక అర్బన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ సెంటర్‌‌‌‌ల పరిధిలో కలిపి మొదటి విడత కింద 2,660, రెండో విడత కింద 1,515, మూడో విడత కింద 2,598, నాల్గో విడత కింద 2,159 మందికి చెల్లింపులు ఆగిపోయాయి.