అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖ

అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖ

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖను ప్రభుత్వం కేటాయించింది . మంగళవారం (నవంబర్ 04) మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఖాళీగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను నిర్వర్తిస్తూ వస్తున్నారు. మైనారిటీలకు మంత్రిత్వ శాఖ కేటాయిస్తామని ఇచ్చిన హామీ మేరకు అజారుద్ధీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ఓడిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు.. ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి కేబినెట్ లోకి తీసుకున్నారు. 

శుక్ర వారం (అక్టోబర్ 31) ఉదయం 11 గంటలకు రాజ్​భవన్​లో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. అజారుద్దీన్​ వరకే తాజా విస్తరణను పరిమితం చేశారు. ప్రస్తుతం సీఎం సహా రాష్ట్ర కేబినెట్​లో మొత్తం 15  మంది ఉన్నారు. అజారుద్దీన్​ రాకతో మంత్రుల సంఖ్య 16 కు చేరింది.  కేబినెట్​లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా.. మరో రెండు మంత్రి పదవులు పెండింగ్ లో ఉంటాయి.

క్రికెటర్​ నుంచి పొలిటీషియన్​గా..

62 ఏండ్ల అజారుద్దీన్ మాజీ క్రికెటర్ గా, టీమిండియా మాజీ కెప్టెన్ గా సుపరిచితులు. హెచ్​సీఏ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. 2009 లో కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్  నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లో రాజస్థాన్  నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసినా అదృష్టం వరించలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అజారుద్దీన్​ పనిచేశారు. తాజాగా కేబినెట్​లో బెర్త్ ఖరారవడంతో బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని అజారుద్దీన్ తో పాటు పలువురు మైనార్టీ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.