జింక మాంసం పేరుతో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే

జింక మాంసం పేరుతో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే

ప్రజల్లో అడవి జంతువుల మాంసం పట్ల ఉన్న ఇష్టాన్ని కొందరు దుర్మార్గులు క్యాష్ చేసుకుంటున్నారు. జింకమాంస పేరుతో కుక్కమాంసం అమ్ముతూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.  నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది. 

ఎలా అమ్మారంటే..

నిర్మల్ జిల్లా  పొట్ట పెళ్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్, చమన్ పల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు లక్ష్మణచందా పట్టణానికి వెళ్లారు. అక్కడ ఆనంద్‌ అనే వ్యక్తికి చెందిన  ఓ పెంపుడు కుక్కను దొంగిలించారు.  ఆ తర్వాత  శ్రీనివాస్‌,  వరుణ్‌ ఆ కుక్కను తమతోపాటు తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా చంపారు. ఈ మాంసాన్ని చుట్టుపక్కల గ్రామాలకు తీసుకెళ్లి  జింకమాంసం పేరుతో అమ్మేశారు. అయితే చుట్టూ అడవులు ఉండేసరికి ఆయా గ్రామాల్లోని ప్రజలు  నిజంగానే జింకమాంసం అనుకుని ఎగబడి కొనుక్కున్నారు. 

సీసీ టీవీలో బాగోతం..

తన పెంపుడు కుక్క చోరీకి గురైందని ఆనంద్  స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా..అసలు విషయం బయటపడింది. కుక్కను శ్రీనివాస్, వరుణ్ ఇద్దరు ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది.

తిన్నవారి పరిస్థితి ఏంటి..

జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించామని నిందితులు శ్రీనివాస్, వరుణ్  ఒప్పుకున్నారు. అయితే కుక్కమాంసాన్ని జింక మాంసం పేరుతో తిన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఏమైనా జరుగుతుందా అని భయపడుతున్నారు.