పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: కాలుష్య కంపెనీని మూసివేయాలని గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానికులంతా కలిసి, ప్రజాసంఘాల మద్దతుతో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్లకుంట చెరువు కలుషితం కావడానికి హెటిరో డ్రగ్స్ యూనిట్- 1 కారణమంటూ నినాదాలు చేశారు. తక్షణమే ఈ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. కాలుష్య జలాల కారణంగా చనిపోయిన దూడల బొమ్మలను ఊరేగింపులో ప్రదర్శించారు. కనీసం తమ గ్రామంలో పండిన బియ్యం కూడా ఎవరూ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నపిల్లల బొక్కలు సైతం అరిగిపోతున్నాయని డాక్టర్ల వద్దకు వెళ్తే తాగుతున్న నీళ్లే కారణమని చెబుతున్నారని వివరించారు. విపరీతమైన ఘాటైన వాసనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కనీసం చుట్టాలు కూడా తమ ఇండ్లకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పీసీబీ సదరు కంపెనీ యాజమాన్యానికే వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్ రెడ్డి, ముత్యాలు, శ్రీనివాస్, ప్రజా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధులు దీప్తి, హేమంత్, విజయలక్ష్మి, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మంగయ్య, సభ్యులు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వేచ్ఛ రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధర్, ఎల్లారెడ్డి, మురారి మధుకర్, సత్తిరెడ్డి, కిష్టారెడ్డి, బాలు గౌడ్, యాదగిరి, శంకరయ్య, వెంకటేశ్, జయమ్మ, స్వప్న, శారద పాల్గొన్నారు.
