పెరిగిన ఫ్లైట్ టికెట్ చార్జీలు.. దేశీయ ప్రయాణం మరింత కాస్ట్‌లీ

పెరిగిన ఫ్లైట్ టికెట్ చార్జీలు.. దేశీయ ప్రయాణం మరింత కాస్ట్‌లీ

న్యూఢిల్లీ: దేశీ విమానయానం మరింత ఖరీదుగా మారుతోంది. విమాన ప్రయాణికులపై ఎక్కువ భారం పడనుంది. డొమెస్టిక్ విమాన చార్జీల కనిష్ట, గరిష్ట పరిమితులను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మరోసారి పెంచింది. వీటిని 9.83 నుంచి 12.82 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. కరోనా పరిస్థితులు, ఫ్యుయల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ చార్జీల లిమిట్స్‌ను పెంచినట్లు మినిస్ట్రీ పేర్కొంది. తాజా పెంపుతో 40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్ ధర రూ.2,600 ఉండగా.. ఇప్పుడు రూ.2,900కు పెరిగింది. ఇదే ప్రయాణ సమయానికి గరిష్ట పరిమితిని 12.82 శాతానికి పెంచడంతో రూ.8,800కు చేరింది.

సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొత్త నిర్ణయంతో ఇకపై 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ సమయం ఉండే విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితి రూ.3,300 ఉన్నది కాస్తా.. ఇప్పుడు రూ.3,700లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని రూ.11,000 పెంచారు. 60 నుంచి 90 నిమిషాల ప్రయాణ సమయానికి టికెట్‌ కనిష్ఠ పరిమితి రూ.4,500, గరిష్ఠ పరిమితిని రూ.13,200లకు పెంచారు. 90 నుంచి120 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.4,700 ఉండగా.. ఇప్పుడు రూ.5,300లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.3 శాతం పెంచారు.150 నుంచి 180 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.7,400 ఉండగా.. ఇప్పుడు రూ.8,300లకు చేరింది. గరిష్ఠ పరిమితిని 12.74 శాతం పెంచారు. 180 నుంచి 210 నిమిషాల ప్రయాణానికి కనిష్ఠ పరిమితి రూ.8,700 ఉండగా.. ఇప్పుడు రూ.9,800లకు పెరిగింది. గరిష్ఠ పరిమితిని 12.39 శాతం పెంచారు.