దేశంలో విమాన ప్ర‌యాణాలు షురూ.. కేంద్రమంత్రి ప్ర‌క‌ట‌న‌

దేశంలో విమాన ప్ర‌యాణాలు షురూ.. కేంద్రమంత్రి ప్ర‌క‌ట‌న‌

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన విమాన ప్ర‌యాణాలు మ‌ళ్లీ మొద‌లుకాబోతున్నాయి. సోమవారం (మే 25) నుంచి దేశంలో డొమెస్టిక్ విమాన స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర‌దీప్ సింగ్ పూరీ ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, విమాన‌యాన సంస్థ‌ల‌కు దీనిపై స‌మాచారం ఇచ్చామ‌ని తెలిపారు. అయితే విమాన ప్ర‌యాణాల సంద‌ర్భంగా ప్ర‌యాణికులు, ఎయిర్ పోర్టు అధికారులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై స్టాండ‌ర్డ్ ఆప‌రేష‌న్ ప్రొటోకాల్ ను పౌర విమాన‌యాన శాఖ విడుద‌ల చేయ‌బోతోంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే అన్ని మార్గాల్లో ఒకేసారి విమాన సర్వీసులు మొద‌లు పెట్టడం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. ద‌శ‌ల వారీగా విమానాల‌ను ఆప‌రేష‌న్స్ పెంచుతూ వెళ్తామ‌న్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ విధించ‌డంతో అన్ని ర‌కాల ర‌వాణా సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు నెల‌న్నర తర్వాత ఇటీవ‌ల 15 ప్ర‌ధాన రూట్ల‌లో రైళ్ల‌ను స్టార్ట్ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. వ‌చ్చే నెల 1 నుంచి 200 రైళ్లను అన్ని రాష్ట్రాల మ‌ధ్య‌ స‌ర్వీసుల‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మే 18 నుంచి లాక్ డౌన్ 4.0లో ఆంక్ష‌ల‌ను స‌డ‌లించిన కేంద్రం.. ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డిపేందుకు రాష్ట్రాల‌కు స్వేచ్ఛ‌నిచ్చింది. దీంతో ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఆర్టీసీ స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేశాయి. అయితే అంత‌ర్రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌ను మొద‌లు పెట్టేందుకు దాదాపు ఏ రాష్ట్రం కూడా ఆస‌క్తి చూలేదు. ఇక‌ ఇప్పుడు తాజాగా దేశీయంగా రాష్ట్రాల మ‌ధ్య విమాన స‌ర్వీసులు షురూ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.