
- ఇదే నా లైఫ్ లో ‘అతిపెద్ద నిర్ణయం’
న్యూయార్క్: ‘‘కనిపించని శత్రువు అమెరికా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. దేశంలో లాక్ డౌన్ ఎత్తేయడమే నా జీవితంలో తీసుకోనున్న అతిపెద్ద నిర్ణయం అవుతుంది. అయితే సరైన సమయంలో లాక్ డౌన్ ఎత్తేస్తాం..’’ అని అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితిపై శుక్రవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా దేశం తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాలని తాను కోరుకుంటున్నాని తెలిపారు. దేశంలో లాక్ డౌన్ ఎత్తేసి, బిజినెస్ యాక్టివిటీస్ ను తిరిగి ప్రారంభించడమే అతిపెద్ద నిర్ణయమని, దీనిపై వైట్ హౌజ్ టాస్క్ ఫోర్స్, ఇతర సలహాదారుల అభిప్రాయాలను పరిశీలించి నిర్ణయిస్తామని చెప్పారు. వాస్తవానికి ఈస్టర్ పండుగ సమయానికి (ఏప్రిల్ 12 నాటికి) లాక్ డౌన్ ఎత్తేయాలని ట్రంప్ ఇంతకుముందు భావించారు. కానీ కరోనా విపత్తు వల్ల అమెరికా ఎకానమీ దాదాపుగా స్తంభించిపోయింది. 33 కోట్ల మంది జనాభాలో 95 శాతం మంది ఇండ్లకే పరిమితమయ్యారు. 1.60 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశంలో శనివారం నాటికి 18,700 మంది కరోనా వల్ల చనిపోగా, పాజిటివ్ కేసులు 5 లక్షలు దాటాయి. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.