అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డాక్యుమెంట్లను బాత్‌‌రూమ్‌‌లో దాచిపెట్టిన డొనాల్డ్ ట్రంప్

అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డాక్యుమెంట్లను  బాత్‌‌రూమ్‌‌లో దాచిపెట్టిన డొనాల్డ్ ట్రంప్
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాకం
  • బెడ్‌‌రూమ్, స్టోర్‌‌‌‌రూమ్‌‌లోనూ బాక్సుల్లో చిత్తుకాగితాల్లా ఉంచిండు
  • వాటిలో అమెరికా అణు రహస్యాలు, మిలిటరీ ప్లాన్లు కూడా ఉన్నయ్

వాషింగ్టన్:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ భద్రతకు సంబంధించిన ఎంతో కీలకమైన సీక్రెట్ ఫైల్స్ ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చిత్తుకాగితాల్లా పడేయడం పెనుదుమారం రేపుతోంది. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన డాక్యుమెంట్లను ఆయన బాత్‌‌రూమ్‌‌లో దాచిపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆరు ఫొటోలను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు. 2021లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన సందర్భంగా వైట్‌‌హౌస్‌‌ను వీడుతూ.. క్లాసిఫైడ్‌‌ డాక్యుమెంట్లను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌‌కు అక్రమంగా తీసుకెళ్లారనే నేరారోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. అమెరికా అణు రహస్యాలు, మిలిటరీ ప్లాన్లు సహా వందలాది రహస్య పత్రాలను మిస్ హ్యాండిల్ చేశారనే అభియోగాలను ఆయనపై మోపారు. ట్రంప్ పై మొత్తం 37 క్రిమినల్ నేరాలు నమోదు కాగా.. అందులో 31 నేరాలు దేశ రక్షణ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తన వద్ద ఉంచుకున్నందుకు నమోదయ్యాయి. ఈ నెల13న మయామి కోర్టులో హాజరుకావాలని ట్రంప్‌‌కు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. “ట్రంప్ యాజమాన్యంలోని మారలాగో క్లబ్ అనేది.. ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు ఉంచేందుకు, స్వాధీనం చేసుకునేందుకు, రివ్యూ చేసేందుకు, ప్రదర్శనకు ఉంచేందుకు, చర్చించేందుకు ఆథరైజ్డ్ లొకేషన్ కాదు. ట్రంప్ వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత వేలాది మంది.. మారలాగోలోని ‘యాక్టివ్ సోషల్ క్లబ్’ని సందర్శించారు” అని అభియోగాల్లో పేర్కొన్నారు.  

కీలక అభియోగాలు ఇవీ..

బాత్‌‌రూమ్‌‌లో న్యూక్లియర్ సీక్రెట్ ఫైల్స్ దాచారు: ఫ్లోరిడా క్లబ్‌‌లోని మారలాగో ఎస్టేట్‌‌లో బాత్‌‌రూమ్‌‌లో క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను దాచారు. బాక్సుల్లో భద్రపరిచిన రహస్య పత్రాల్లో డిఫెన్స్, వెపన్స్ కేపబిలిటీస్, అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, మిలిటరీ ప్లాన్స్ సమాచారం ఉంది. వాటిలో కొన్ని సెన్సిటివ్ అని, వాటికి ప్రత్యేక నిర్వహణ అవసరమని నేరారోపణ పత్రంలో పేర్కొన్నారు. క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను షేర్ చేశారు: డొనాల్డ్ ట్రంప్ రెండు సందర్భాల్లో రహస్య పత్రాలను ఇతరులకు చూపించారని తెలిపారు. ఇంకో చోటుకు తరలించారు: 2021లో ట్రంప్ సహాయకుడు నౌటా కొన్ని ఫైల్స్‌‌ను ఓ బిజినెస్ సెంటర్‌‌‌‌కు తీసుకెళ్లాడు. ట్రంప్ కూడా కొన్ని తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఫైల్స్ నాశనానికి ప్రయత్నించారు:  తన అటార్నీలు, ఎఫ్‌‌బీఐ ఏజెంట్లకు కనిపించకుండా ఫైల్స్ దాచాలంటూ నౌటాను ట్రంప్ ఆదేశించారు. ‘దాచు లేదా నాశనం చేయి’ అని ట్రంప్ చెప్పినట్లు ఆరోపణలున్నాయి.

ఇద్దరు లాయర్లు తప్పుకున్నరు

ట్రంప్ లీగల్ టీమ్‌‌ నుంచి లాయర్లు జిమ్ ట్రస్టీ, జాన్ రౌలీ తప్పుకున్నారు. ‘‘ట్రంప్‌‌కు న్యాయవాదులుగా మా రాజీనామాలను అందజేశాం. మేం ఇకపై ఆయన తరఫున ప్రాతినిధ్యం వహించం” అని సంయుక్త ప్రకటనలో లాయర్లు పేర్కొన్నారు. స్పందించిన ట్రంప్.. ‘‘జిమ్ ట్రస్టీ, జాన్ రౌలీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నిజాయతీ లేని, అవినీతి, చెడు, అనారోగ్య వ్యక్తుల సమూహానికి వ్యతిరేకంగా వారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను నేను ఇంతకు ముందు చూడలేదు. రాబోయే రోజుల్లో అదనపు లాయర్లను ప్రకటిస్తాం” అని ఆయన వెల్లడించారు.