గోశాలలో ఆవులకు దుప్పట్లు దానమిస్తే గన్ లైసెన్స్ ఫ్రీ!

గోశాలలో ఆవులకు దుప్పట్లు దానమిస్తే గన్ లైసెన్స్ ఫ్రీ!

ఓ కలెక్టర్ వింత ఆఫర్ ఇచ్చాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇవ్వాల్సిన గన్ లైసెన్స్ చాలా సింపుల్ గా ఇచ్చేస్తానని ప్రకటించాడు. పది దుప్పట్లు కొనగలిగే శక్తి ఉంటే చాలు ఎవరైనా తుపాకీ తమతో ఉంచుకునేందుకు అనుమతి పొందొచ్చు. పక్కగా పాటించాల్సిన మిగతా కండిషన్లేవీ పట్టించుకోరట. ఈ చలికాలంలో ఆ పది దుప్పట్లను ఆవులకు దానం చేస్తే చాలు. అంతే గన్ లైసెన్స్ పొందొచ్చు.

ఇది ఉత్తి గాలి మాట కాదు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ చౌదరి.. శనివారం నాడు చేసిన ప్రకటన ఇది. ఆత్మ రక్షణ కోసం తుపాకీ కావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్లు ఏదైనా గోశాలకు 10 దుప్పట్లు దానం చేసి ఉంటే లైసెన్స్ ఇచ్చేసేలా ఆర్డర్స్ పాస్ చేశారు. గన్ లైసెన్స్ కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనలో మిగతా కండిషన్లు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని జిల్లా అధికారులకు సూచించారు.
సమాజంలో మార్పు కోసమేనట
కలెక్టర్ అనురాగ్ తాను ఇచ్చిన ఆదేశాలపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ నిర్ణయంతో పర్యావరణానికి మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. సమాజంలోనూ దానగుణం, మంచిచేయాలన్న ఆలోచన వచ్చి మార్పు వస్తుందని అన్నారు. అయితే ఆయన ఇలాంటి వెరైటీ ఆర్డర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో మొక్కలు నాటి వాటిని బాగా పెంచిన వారికి గన్ లైసెన్స్ ఇస్తామని ప్రకటించారు అనురాగ్ చౌదరి.