డొనేషన్ల దోపిడీని అరికట్టాలి.. ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

డొనేషన్ల దోపిడీని అరికట్టాలి.. ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

ట్యాంక్ బండ్, వెలుగు: ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోట సీట్ల డొనేషన్లను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అడ్డు అదుపు లేకుండా  డొనేషన్ల పేరుతో 10 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం (May 24) ఆయన సెక్రటేరియెట్ మీడియా సెంటర్ వద్ద14 బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ప్రైవేట్ ఇంజనీరింగ్ లో 40 శాతం సీట్లు యాజమాన్య కోట కింద ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనితో అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచ్చలవిడి డొనేషన్లను అరికట్టాలని కోరారు. యాజమాన్య కోటా సీట్లను 40 శాతం నుంచి 30శాతానికి తగ్గించాలని, యాజమాన్య కోట సీట్ల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 

ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్య కోట సీట్లకు డొనేషన్ వసూలు చేయొద్దని, ఈ కోటాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య  కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.