చదువు కోసం లక్షల్లో విరాళాలు

చదువు కోసం లక్షల్లో విరాళాలు

‘పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంటుంది’ అని నమ్మారామె. మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో తన పెన్షన్​ డబ్బులను విరాళంగా ఇస్తున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. కోటి రూపాయల దాకా విద్యాసంస్థలకు ఇచ్చారు రిటైర్డ్​ ప్రొఫెసర్​ చిత్రలేఖ మల్లిక్​. చిత్రలేఖ వయసు డెభ్బై రెండు. కోల్​కతాలోని చిన్న అపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. సంస్కృతం సబ్జెక్టును టీచ్​ చేసేవారు. వేలల్లో జీతం ఉన్నప్పటికీ, బస్సుల్లోనే ప్రయాణం చేయడానికి ఇష్టం చూపుతారు. ఇప్పటికీ కామన్​ ఉమెన్​లా బతుకుతారు. మార్పు అనేది చదువుతోనే సాధ్యం అంటారు. “నాలుగు దశాబ్దాలుగా టీచింగ్​ ప్రొఫెషన్​లో ఉన్నా. ఇన్నేళ్ల సర్వీస్​లో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. చాలా విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పుట్టుకొస్తున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. కనీస వసతులు అందించడం లేదు. ర్యాంకుల పేరుతో చదువులను నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీని వల్ల పేద పిల్లలు నష్టపోతున్నారు. బేసిక్​ ఎడ్యుకేషన్​ అందక, ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారు. అందుకోసమే ఏదైనా చేయాలనిపించి, ప్రతినెలా పెన్షన్​ డబ్బును పొదుపు చేయడం మొదలుపెట్టా. ఆ డబ్బులను పేద పిల్లలకు స్కాలర్​షిప్స్​గా అందిస్తున్నాను’’ అని అన్నారు చిత్రలేఖ.

చదువు కోసం..

కోల్​కతాలోని బీర్లాపూర్​ అనే చిన్న పట్టణంలో పుట్టారు చిత్రలేఖ. మధ్య తరగతి కుటుంబం. తండ్రి స్కూల్​ టీచర్​. ‘పిల్లలకు డబ్బులు, వస్తువులకు బదులు నాలెడ్జ్ ఇవ్వాలి’ అనేది ఆయన ఫిలాసఫీ. తండ్రి ప్రభావం ఆమెపై పడింది. చిన్నప్పట్నుంచే హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. చదువుకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చేవారు. టీచింగ్​ ప్రొఫెషన్​పై ఇష్టంతో పెళ్లి కూడా వద్దనుకున్నారు. ప్రొఫెసర్​ అయ్యాక వచ్చే పెన్షన్​ డబ్బులను విద్యా సంస్థలకు ఇవ్వాలనుకున్నారు. ప్రతినెలా పెన్షన్​ డబ్బులు (యాభై వేల వరకు) విరాళంగా ఇస్తున్నారు. ప్రొఫెషన్​లో భాగంగా ఏ ఊరెళ్లినా సాదాసీదా జీవితమే గడిపారు. ఒకే రకమైన బట్టలు ధరించడానికి ఇష్టం చూపేవారు. ‘‘విక్టోరియా ఇన్​స్టిట్యూట్​లో పనిచేసే సమయంలో, అక్కడ సరైన మెడికల్​ యూనిట్​ లేక స్టూడెంట్స్​ ఇబ్బందులు పడేవాళ్లు. యాభై వేలు ఖర్చు చేసి క్యాంపస్​లోనే యూనిట్​ పెట్టా. అదే సమయంలో న్యాక్​బృందం విజిట్​ చేసింది. ఇన్​స్టిట్యూట్​ పనితీరు బాగుండటంతో న్యాక్​ గుర్తింపు వచ్చింది”అని చెప్పారామె.

లక్షల్లో విరాళాలు

2013లో ‘ఇండియన్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ హౌరా’కు తల్లిదండ్రుల పేరుతో ముప్పై ఒక్క లక్షలను విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం ‘జాదవ్​పూర్​ యూనివర్సిటీ’కి యాభై ఆరు లక్షలు డొనేట్​ చేశారు. ‘చిత్రలేఖ స్ఫూర్తితో ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారు. ఆమె వల్ల ఎన్నో విద్యాసంస్థలు బాగుపడ్డాయి’ అని లోకల్​ మీడియా, ఇంగ్లిష్​ పత్రికలు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నాయి. ఆమె ఇచ్చే డబ్బులను, స్కాలర్​షిప్​గా స్టూడెంట్స్​కు అందిస్తున్నాయి విద్యా సంస్థలు. సొసైటీకి తనవంతుగా ఏదైనా చేయాలనిపించి నెలనెలా వచ్చే యాభై వేల రూపాయల పెన్షన్ విరాళంగా ఇస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు. నలభై మూడేళ్ల కెరీర్​లో ఎన్నో విద్యాసంస్థల్లో పనిచేశారు. ప్రముఖ విద్యాసంస్థలైన మాతాభంగా కాలేజ్, కూచ్ బెహర్, కాలేజ్ సర్వీస్ కమిషన్, దేశబంధు బాలికల కళాశాల, చివరగా విక్టోరియా ఇన్​స్టిట్యూట్​లో పాఠాలు చెప్పారు.

see also: వేడినీళ్లతో ఎంతో మంచిది

సర్పంచ్ గుడ్ జాబ్ : కొలువులకు కేరాఫ్ ప్రేరణ

రెండేళ్లుగా గ్రూప్-2 కోసం నిరీక్షిస్తున్నా