మహాబలిపురం: తమిళనాడులో గత, ప్రస్తుత ప్రభుత్వాలు బీజేపీకి తలొగ్గాయని తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ విమర్శించారు. ‘‘అన్నాడీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పరోక్షంగా బీజేపీకి సరెండర్ అయ్యాయి. కానీ మేం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం.. ఎవరికీ తలవంచం. ఒంటరిగా పోటీ చేసినా గెలిచే సత్తా మాకుంది” అని తెలిపారు. ‘‘మనకు హాని చేయాలని చూస్తున్నోళ్ల నుంచి మన ప్రజలను, మన రాష్ట్రాన్ని కాపాడడమే నా లక్ష్యం. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమిదే. మేం ఎవరి కోసమో, దేనికోసమో రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడం” అని చెప్పారు.
ఆదివారం మహాబలిపురంలో టీవీకే స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తు ‘విజిల్’ను విజయ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసారి తమిళనాడులో జరగబోయేవి కేవలం ఎన్నికలు కాదని, ప్రజాస్వామ్య యుద్ధమన్నారు. ఇందులో పార్టీని ముందుండి నడిపించే కమాండోలు కార్యకర్తలేనని అన్నారు. ‘‘మనకు ప్రతి ఓటూ ముఖ్యమైనదే. ఒక్క ఓటు కూడా చోరీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వచ్చే కొన్ని నెలల పాటు అందరూ జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు.
అవినీతిని అంతం చేస్తం..
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలపై విజయ్ విమర్శలు గుప్పించారు. ‘‘దుష్టశక్తులను (డీఎంకే), అవినీతిపరులను (అన్నాడీఎంకే) ఎదుర్కొనే సత్తా మాకే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గత, ప్రస్తుత ప్రభుత్వాల్లాగా నేను అవినీతికి పాల్పడను. ఒక్క పైసా ముట్టుకోను. అవినీతిరహిత పాలనను అందిస్తాం. ఏండ్లుగా అవినీతి రాజ్యమేలుతున్న వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. అది ఒక్క రోజులో సాధ్యం కాదు. అదొక ప్రక్రియ.. దాన్ని మేం తప్పకుండా చేసి చూపిస్తాం” అని హామీ ఇచ్చారు.
