పెట్రోల్, డీజిల్ బండ్లు కొనొద్దు .. సీఎం సుఖ్విందర్ ఆదేశాలు

పెట్రోల్, డీజిల్ బండ్లు కొనొద్దు ..   సీఎం సుఖ్విందర్  ఆదేశాలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ను క్లీన్ అండ్ గ్రీన్ స్టేట్ గా మలిచే లక్ష్యం దిశగా ఆ రాష్ట్ర  సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అడుగులు వేస్తున్నారు. అందుకు సంబంధించి శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు 2024, జనవరి1 నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

ఇక ఆయా శాఖల వాహనాల కొనుగోలుకు స్టేట్ కేబినెట్ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ హిమాచల్ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందు కోసం ఆరు హైవేలను గ్రీన్ కారిడార్లుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రవాణా శాఖలోని అధికారిక వాహనాలను ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో భర్తీ చేశామని పేర్కొన్నారు.