
- ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే కొనసాగించండి
- సీఎం రేవంత్‌కు సీపీఎం ప్రతినిధుల బృందం వినతి
హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ భూసేకరణను ముందుగా నిర్ణయించిన అలైన్‌మెంట్ ప్రకారమే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు వారు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ, సిరిసిల్ల పవర్‌లూమ్‌కు విద్యుత్ చార్జీలు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల వంటి పలు సమస్యలపై చర్చించారు.
భూసేకరణలో మొదటి అలైన్‌మెంట్‌ను ప్రభుత్వం మార్చడం వల్ల మధ్యతరగతి ఉద్యోగులు, రైతులు, పేదలు నష్టపోతున్నారని, ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోవాలని కోరారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లడం కష్టమని, బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నాం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. సిరిసిల్ల పవర్‌లూం కార్మికులను ఆదోవాలని కోరారు.