జీ 20 సదస్సు : తైవాన్​ వ్యవహారంలో జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్​

జీ 20 సదస్సు :  తైవాన్​ వ్యవహారంలో జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్​

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కు చైనా అధ్యక్షుడు షి జిన్​ పింగ్​ వార్నింగ్​ ఇచ్చారు. తైవాన్​ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్​ లైన్​ దాటొద్దని అమెరికాకు సూచించారు. తమ దేశ ప్రయోజనాలతో ముడిపడిన అత్యంత కీలకమైన తైవాన్​ అంశంలో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా నడుచుకుంటే చైనా, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నారు. జీ20 సమావేశాల కోసం ఇండోనేషియాలోని బాలీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్​ తో చైనా అధ్యక్షుడు షి జిన్​ పింగ్​ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

ఉక్రెయిన్​ లోని పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించారు. ఉక్రెయిన్​, రష్యా మధ్య జరిగే శాంతి చర్చలకు తమవంతు సహకారం అందిస్తామని బైడెన్​ కు జిన్​ పింగ్​ హామీ ఇచ్చారు. అమెరికా, చైనాలు అభివృద్ధిలో దూసుకుపోతూ.. ప్రపంచ మార్కెట్​ లో పరస్పరం పోటీపడాలని పేర్కొన్నారు.