
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మాణం చేస్తదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7 లక్షల కోట్ల అప్పులున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటితో పోల్చితే అప్పులు పది రెట్లు పెరిగాయి. దానికి అనుగుణంగా ఆస్తులు పెంచుకున్నామా? లేదా? అనేది ప్రజలకు చెప్పాలి”అని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అప్పుల ఊబిలో ఉన్నామని తప్పించుకోవాలని చూస్తే బీజేపీ ఊరుకోదన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమీకరిస్తారో చెప్పాలన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని, రైతు బంధు, వరికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇపుడు 100 రోజుల్లో అమలు అంటున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేయలేదు కదా.. అని తప్పించుకుంటే కుదరదని, వాళ్లు అమలు చేయలేదు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.90 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఖర్చు పెట్టారని, అందులో చాలా అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపిస్తారా? లేదా సిట్టింగ్ జడ్జితో చేయిస్తారా? సీఎం చెప్పాలన్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే బీజేపీ అండగా ఉంటుందన్నారు. పదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, ఇప్పుడు కూడా ఇస్తుందని ఆయన అన్నారు.
కేంద్రం ఫెడరల్ సిస్టంలో వెళితే ఫండ్స్తెచ్చుకుంటం : పొన్నం
మహేశ్వర్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని.. కేంద్రం ఫెడరల్ సిస్టంలో ముందుకెళితే నిధులు తెచ్చుకుంటామన్నారు. ‘‘పదేండ్ల నుంచి దేశాన్ని మీరు అమ్ముతున్నారు. పార్లమెంట్ మీద దాడి జరిగితే చర్యలు తీసుకోవట్లేదు. బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తామని ఇంత వరకు చేయలేదు. దేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు. అలాంటి బీజేపీ వాళ్లు హామీల అమలు గురించి మాట్లాడుతున్నారు.’’ అని పొన్నం ఎద్దేవా చేశారు. హామీల అమలు చేసే బాధ్యత తమపై ఉందన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ వాళ్లు ఆందోళన చెందవద్దని, అధికారంలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదని పొన్నం గుర్తుచేశారు.