శాలువాలు వద్దు.. తువ్వాలలు తేండి: హరీశ్

శాలువాలు వద్దు.. తువ్వాలలు తేండి: హరీశ్

సిద్దిపేట: రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తన్నీరు హరీశ్ రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధిపేటలోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున ఆయన్ను కలిసేందుకు అభిమానులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పూల దండలు, బొకేలతో వచ్చారు. అయితే తనను కలిసేందుకు వచ్చే అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు వినూత్న విజ్ఞప్తి చేశారు హరీశ్. పూలదండలు, బొకేలకు బదులుగా నోట్ పుస్తకాలు, శాలువాలకు బదులుగా తువ్వాలలు ఇవ్వాలని సూచించారు.

నలుగురికి నచ్చేలా.. నలుగురు మెచ్చేలా మంచి చేద్దామని.. మీరిచ్చే నోట్ పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు హరీశ్. అలాగే నేత కార్మికుడు నేసిన తువ్వాలలు తేవడం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచిన వారమవుతామని తెలిపారు. ఈ విషయంలో తాను ప్రత్యేకించి చొరవ చూపుతానని, మీరంతా ఈ విధానాన్ని పాటించాలని దండం పెట్టి మరీ చెబుతున్నానని మంత్రి హరీశ్ రావు చెప్పారు.