సమ్మర్‌‌‌‌‌‌‌‌లో తాగు నీటికి ఇబ్బందులు రావొద్దు : మంత్రి సీతక్క

సమ్మర్‌‌‌‌‌‌‌‌లో తాగు నీటికి  ఇబ్బందులు రావొద్దు :  మంత్రి సీతక్క

 

  •     వాటర్ లీకేజీ కాకుండా మరమ్మతులు చేపట్టండి: 
  •     మిషన్ భగీరథ అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గూడేలకు ప్రతి రోజు తాగు నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్ మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌ ఎర్రమంజిల్‌‌‌‌లో మిషన్ భగీరథ అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే 4 నెలల సమ్మర్ టైమ్ కీలకమని, తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పైప్‌‌‌‌లు లీకేజీలను గుర్తించి వెంటనే రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న తాగు నీటి రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను పరిష్కరించాలని ఇంజినీర్లను ఆదేశించారు. స్పెషల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి నిధులను కేటాయించటంపై ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. రివ్యూలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్‌‌‌‌ఈలు పాల్గొన్నారు.