ఎవరి మాట లెక్క చేయాలి

ఎవరి మాట లెక్క చేయాలి

ఒకసారి ఒక బౌద్ధ భిక్షువు భిక్షాటన చేస్తూ ఒక ఇంటి ముందు నిలబడి, ‘భవతీ భిక్షాందేహి’ అని భిక్ష అడిగాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి ‘దిట్టంగా, ఆరోగ్యంగా ఉన్నావు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇలా ఇంటింటికీ వచ్చి అడుక్కుంటూ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి?’ అని విసురుగా మాట్లాడుతుంది. తరువాత ‘ఉండు, ఇప్పుడే ఇంత భిక్ష తెచ్చి పడేస్తా’ అంటూ విసవిసా లోపలకు వెళ్లింది. ఆ తల్లి లోపలకు వెళ్లగానే భిక్షువు ఆ ఇంటి గుమ్మం ముందు నుంచి మరో సందులోని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఇల్లాలు బయటకు వచ్చి చూసేసరికి భిక్షువు కనపడలేదు ‘నా బియ్యం నాకు మిగిలాయి’ అనుకుంటూ ఆవిడ లోపలకు వెళ్లిపోయింది.

సందు మలుపు దాటిన తరువాత – భిక్షువును ఉద్దేశించి పక్కనే ఉన్న మరో సాధువు ‘అయ్యా! ఆవిడ అన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వచ్చేశారేం?’ అని తన సందేహాన్ని నివృత్తి చేసుకునే ఉద్దేశంతో ప్రశ్నించాడు. అందుకు ఆ భిక్షువు చిరునవ్వుతో ‘నాయనా! ఆవిడ తెచ్చిన భిక్ష మనం తెచ్చుకున్నామా?’ అని అడిగాడు. అందుకు సాధువు ‘లేదు’ అని సమాధానమిచ్చాడు. ‘అదేవిధంగా ఆవిడ ఇచ్చిన తిట్లను కూడా మనం తెచ్చుకోకూడదు’ అని ప్రశాంతంగా పలికాడు. సాధువుకి విషయం అర్థమైంది. అనవసరంగా ఎవరైనా మనలను దూషిస్తే ఆ విషయాలను అక్కడే వదిలేయాలని అర్థం చేసుకున్నాడు.

అంతేకాదు... ‘నిన్ను చూసి మొరిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్లు విసరాల్సిన అవసరం లేదు. అలా చేస్తూ వెళ్తే నీ గమ్యం నువ్వు చేరలేవు అంటారు మన పెద్దలు’ అని పలికాడు భిక్షువు.

మరో కోణంలో చూస్తే 

 ఒక ఏనుగు నడుస్తుంటే, దాని వెనకాల ఎన్నో కుక్కలు మొరుగుతుంటాయి. కానీ ఏనుగు అదేమీ లెక్కచేయకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే అనవసరమైన వారి మాటలను లెక్కచేయక్కరలేదని ఆ ఏనుగు ఆలోచనలోని అంతరార్థంగా భావించాలి. ఇది ఒక రకమైన అంశం.

ఇక భారతంలో శిశుపాల వధ కథ విషయానికి వస్తే – ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా పూర్తి చేశాడు. వచ్చిన వారందరినీ మణిమాణిక్యాలతో, చీనిచీనాంబరాలతో సత్కరించాడు. యాగాన్ని ముగించిన సందర్భంగా పెద్దలకు అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నాడు. పాండవులకు శ్రీకృష్ణుడు పెద్ద దిక్కు. ముందు నుంచి ఆయన అండతోనే పాండవులు విజయాలు సాధించారు. అందువల్ల ఆ అగ్రతాంబూలం ఆయనకే ఇవ్వాలని సూచించాడు భీష్ముడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. బాల్యం నుంచి శిశుపాలుడికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అందువల్ల... శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం అనగానే విపరీతమైన కోపం వచ్చింది. మితిమీరిన అసూయతో శ్రీకృష్ణుడిని దూషించటం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ శిశుపాలుడి దూషణలు వింటున్నాడు. వంద తప్పులు చేసేవరకు శిశుపాలుడిని చంపబోనని శ్రీకృష్ణుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. వంద తప్పులు పూర్తి కాగానే చక్రం ధరించి శిశుపాలుడిని సంహరించాడు. 

ఇక్కడ శిశుపాలుడిని వధించకపోతే మరింతమందిని దూషిస్తూ, వారిని సంహరించే అవకాశం ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించాడు. ‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు అదే విమర్శ మనకి ఎదురైతే ఎలా బాధపడతామో ఆలోచిస్తే... విమర్శించాలనే ఆలోచన ఎప్పటికీ రాదు’’ అనే విషయం శిశుపాలుని వంటి మూర్ఖులకు అర్థం కాదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.

మరో రకంగా పరిశీలించాలి  

భారతంలో సభాపర్వంలో శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి పెద్దలందరితో పాటు దుర్యోధనుడిని ఉద్దేశించి రాయబారం నడుపుతుండగా... దుర్యోధనుడు రుసరుసలాడుతూ సభ నుంచి నిష్క్రమించాడు. అది చూసిన భీష్మాదులు.. ధృతరాష్ట్రునితో ‘ప్రభూ! రాయబారి మాట్లాడుతుండగా అతడిని అవమానిస్తూ సభ నుంచి నిష్క్రమించటం సభ్యత కాదు. ఇది వినాశనానికి కారణమవుతుంది’ అని హెచ్చరించారు. అంటే ఎక్కడ ఎవరి మాటలను వినాలో, ఎక్కడ ఎవరి మాటలను లెక్కచేయక్కరలేదో తెలుసుకోవాలి. శ్రీకృష్ణుని వంటి విజ్ఞులు చెప్పిన ఇటువంటి విషయాలను అక్కడికక్కడ విడిచిపెట్టకూడదు. ఇదే సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. విజ్ఞులు బోధించే మంచిని శ్రద్ధగా వినాలి. అంతరార్థం తెలుసుకుని, ఆచరించటం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు.

ఒక ఏనుగు నడుస్తుంటే, దాని వెనకాల ఎన్నో కుక్కలు మొరుగుతుంటాయి. కానీ ఏనుగు అదేమీ లెక్కచేయకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే అనవసరమైన వారి మాటలను లెక్కచేయక్కరలేదని ఆ ఏనుగు ఆలోచనలోని అంతరార్థంగా భావించాలి.

 డా. వైజయంతి పురాణపండ
80085 51232