రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం 

రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం 

 

  • ‘పోడు’ కమిటీల మీటింగ్​లు పెట్టొద్దు
  • రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు ఆదేశం 
  • తిరిగి చెప్పే వరకూ నిర్వహించొద్దని మధ్యంతర ఉత్తర్వులు
  • కౌంటర్లు ఫైల్ చేయాలని ఆర్డర్ .. విచారణ అక్టోబర్ 21కి వాయిదా 
  • జీవో 140 రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ

హైదరాబాద్, వెలుగు:  పోడు భూములపై గిరిజనుల హక్కులను నిర్ధారించేందుకు జీవో 140 ప్రకారం జిల్లాల్లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల సమావేశాలను ఆపాలని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. తాము తిరిగి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ కమిటీల సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోడు భూములపై గిరిజనుల హక్కులను నిర్ధారించేందుకు ప్రభుత్వం జీవో 140 ఇచ్చింది. దీని ప్రకారం జిల్లాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే వాటిలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు చోటు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చెందిన గిరిజనులు వేర్వేరుగా మూడు రిట్లు దాఖలు చేశారు. 

వీటిపై జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పోడు భూములపై హక్కుల నిర్ధారణకు నిర్దిష్ట విధానం ఉందని, అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చిందని, దానికి విరుద్ధంగా జీవో 140 ఉందన్నారు. నిబంధనల ప్రకారం గ్రామ సభ నుంచి జిల్లా అధికారులతో కూడిన కమిటీ, రాష్ట్ర స్థాయిలో అదే తరహాలో మరో కమిటీ ఉంటుందని చెప్పారు. అయితే కేంద్ర చట్టాన్ని కాదని ప్రభుత్వం జీవో ద్వారా కమిటీలు ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటే ఫలితాలు రాజకీయంగానే ఉంటాయని తెలిపారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని వెంటనే నిలిపివేయాలని కోరారు. 

స్టే అక్కర్లే: ప్రభుత్వ లాయర్ 

గవర్నమెంట్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ ప్లీడర్‌‌‌‌ ఎ.సంజీవ్‌‌‌‌కుమార్‌‌‌‌ వాదిస్తూ.. పోడు రైతులను గుర్తించేందుకే జీవో 140 ద్వారా జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వారి యాజమాన్య హక్కులను కేంద్ర చట్టం ప్రకారమే నిర్ధారిస్తామని చెప్పారు. పోడు సాగు నివారణకు కృషి చేస్తూనే క్లెయిమ్స్‌‌‌‌ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. జీవోపై స్టే అవసరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. ‘పోడు సాగు నివారణ అంటూనే క్లెయిమ్స్‌‌‌‌ పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. దీనిపై క్లారిటీ కావాలి’ అని చెప్పింది. అందుకే కమిటీలు సమావేశం కావొద్దని ఉత్తర్వులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణను అక్టోబర్‌‌‌‌ 21కి వాయిదా వేసింది.