‘ధరణి’లో నమోదు చేసుకోకపోతే ఆస్తులు అమ్ముకోవద్దా?

‘ధరణి’లో నమోదు చేసుకోకపోతే ఆస్తులు అమ్ముకోవద్దా?
  • రాష్ట్ర సర్కార్​ను ప్రశ్నించిన హైకోర్టు
  • ఆధార్​, ఫోన్​ నంబర్​, కులం ఎందుకు అడుగుతున్నరు?
  • ఐటీ హబ్​ ఉన్న మన దగ్గరే డిజిటలైజేషన్​కు ఇంత లేటా?
  • వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై 8 వరకు స్టే పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ‘‘ధరణి పోర్టల్​లో ఆస్తుల నమోదు చేసుకోకపోతే వాటి కొనుగోలు అమ్మకాలకు అనుమతి ఇవ్వరా? ఆస్తులు బదిలీ చేయాలనుకునే వారంతా ధరణిలో తమ వివరాల్ని నమోదు చేసుకోవాల్సిందేనా? లేకపోతే బదిలీకి అనుమతించరా?’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తులు నమోదుపై గత స్టే ఉత్తర్వులను ఈ నెల 8 వరకూ పొడిగించింది.

ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి డివిజన్‌ బెంచ్‌ గత మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్, ఫోన్‌ నెంబర్, కులం, ఫ్యామిలీ మెంబర్స్‌ వివరాలను ధరణిలో నమోదు చేసుకోకపోతే ఆస్తుల క్రయవిక్రయాలకు వీలుండదని ప్రభుత్వం ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఏడు పిల్స్‌పై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘ధరణిలో ఆస్తుల నమోదుకు కులం, ఆధార్, ఫోన్‌ నెంబర్, ఫ్యామిలీ మెంబర్స్‌ వివరాలు ఎందుకు అడుగుతున్నారు? రికార్డుల్లో ఆస్తుల వివరాలు ఉన్నప్పుడు కులం, ఆధార్‌ వంటి వివరాలు ఎందుకు? ఆర్వోఆర్‌ను సరిగ్గా ఎందుకు నిర్వచించలేదు? చట్ట సవరణ చేసినప్పుడు ఆర్వోఆర్‌ను కూడా పూర్తి స్థాయిలో నిర్వచించాలి కదా? కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చి ఎన్నో ఏండ్లు అవుతున్నా ఆస్తుల డిజిటలైజేషన్‌ను ఇప్పటివరకూ ఎందుకు చేపట్టలేదు? రాజస్థాన్‌లో పదేండ్ల కిందటే జరిగింది. ఐటీ హబ్‌ ఉన్న మన దగ్గర ఎందుకు ఆలస్యమైంది?” అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ప్రభుత్వం చెబుతున్న వివరణ అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది.

నోటి ద్వారా చెప్తే..అది చట్టం అవుతుందా?: పిటిషనర్లు

పిటిషనర్ల తరఫు సీనియర్‌ అడ్వకేట్​దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి వాదిస్తూ.. చట్టం చేయకుండా వ్యవసాయేత ర ఆస్తులకు ప్రభుత్వం పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇస్తామని ప్రకటించిందన్నారు. వ్యవసాయ భూములకు మాత్రమే ఆర్వోఆర్‌ వర్తిస్తుందని, వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు ఇవ్వడం చట్ట వ్యతిరేకం అవుతుందని పేర్కొన్నారు. పంచాయితీ, మున్సిపల్, మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టాలను ఈ ఏడాది ప్రభుత్వం సవరించినా వాటిలో క్లారిటీ లేదని, ఇది రాజ్యాంగంలోని 300ఎ అధికరణానికి వ్యతిరేకమన్నారు. ఏ చట్టం లేకుండా ధరణిలో ఆధార్, కులం ఇతర వివరాలు నమోదు చేసుకోకపోతే భవిష్యత్‌లో క్రయవిక్రయాలకు వీలుండదని ప్రభుత్వం చట్ట రూపంలో కాకుండా ప్రకటన ద్వారా తెలిపిందని పేర్కొన్నారు. నోటి మాటగా ధరణిలో నమోదు చేసుకోవాలంటే అది చట్టం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు.. కొత్త చట్టంలో చెప్పనప్పుడు పాత చట్టంలోని నిర్వచనాలను అన్వయం చేసుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్‌ అయ్యాక మ్యుటేషన్‌ అవుతోందని, ఇకపై రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ చేయాలన్న నిర్ణయం  మంచిదే కదా అని ప్రశ్నించింది. దీనిపై ప్రకాష్‌రెడ్డి.. చట్టం చేసి చేస్తే చెల్లుబాటు అవుతుందని, రేపు పొరపాట్లు జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని, పాలకుడికి కల వస్తే పదిహేను రోజుల్లో పనైపోవాలంటే ఎలాగన్నారు. హైకోర్టు నవంబర్‌ 3న స్టే ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే రాష్ట్ర సర్కార్‌ సెప్టెంబర్‌ 8 నుంచే రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాల్ని ఆపేసిందన్నారు. ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఆస్తులను కొలిచి వెళ్లారని, ఆస్తికి ఓనర్‌ ఎవరో తేలకుండానే వాటిని ధరణిలో నమోదు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఒకసారి నమోదైన ఆస్తి తప్పు అయితే వాటిని సరిచేసే వాళ్లు లేకపోతే ఆస్తి యజమాని పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఆస్తుల్ని ఎన్యూమరేషన్‌ చేసిన అధికారి ఏ చట్టం కింద ఆస్తుల్ని కొలతలు కొలిచారో తేల్చాలని ఆయన కోరారు. నోటి మాటగా ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోకపోతే ఆస్తులకు వారసత్వ హక్కులు పోతాయనే భయాన్ని కూడా పాలకులు కలిగించారని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అందరూ హర్షిస్తారని, అయితే అది చట్ట ప్రకారం చేయాలని ప్రకాష్‌రెడ్డి అన్నారు.

స్టే ఎత్తేయండి: ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ ప్రతివాదన చేస్తూ.. అన్ని ఆస్తుల్ని ప్రభుత్వం డిజిటలైజేషన్‌‌ చేయాలనే యోచనలో ఉందన్నారు. ధరణిలో నమోదు కూడా చట్టానికి లోబడే చేస్తున్నామని చెప్పారు. పలు ప్రభుత్వ పథకాలను అమలు చేసేప్పుడు ఆధార్‌‌ వంటి వివరాలను నమోదు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఆస్తుల వివరాలు నమోదు అయితే రైతుబంధు, ఇంటి పన్నుల రాయితీ, నీటి రాయితీ వంటివి పొందే లబ్ధిదారులు ఎవరో గుర్తించడం సులభం అవుతుందని చెప్పారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేశారని, పిల్స్‌‌ను కొట్టేయాలని ఆయన కోరారు. స్టేను రద్దు చేయాలన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. అందరి వాదనలు పూర్తిగా విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని, విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.