పౌరహక్కుల సంఘం మహాసభలను విజయవంతం చేయాలి : వి. సంగం

పౌరహక్కుల సంఘం  మహాసభలను విజయవంతం చేయాలి :  వి. సంగం

బోధన్​, వెలుగు : పౌరహక్కుల సంఘం 3వ మహాసభలను  విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సంగం పిలుపునిచ్చారు. గురువారం  బోధన్​లో పౌరహక్కుల సంఘం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. నవంబర్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమస్యలపై పౌర హక్కుల సంఘం పోరాడుతుందన్నారు. 

హక్కుల సాధన కోసం చేసిన ఉద్యమంలో ఎంతోమంది  అసువులు బాశారన్నారు. రాజ్యం బూటకపు ఎన్​కౌంటర్లలో ఉద్యమకారులు అమరులయ్యారని, సుప్రీం కోర్టులో విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రాంతం, జాతి, మతం, కులాల పేరుతో ప్రభుత్వాలు కొనసాగిస్తున్న అణిచివేతను హక్కుల సంఘం ప్రశ్నిస్తుందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో మహిళలపై జరిగే అరాచకాలను ఖండిస్తున్నామన్నారు. 

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా, ఆదివాసీ ప్రాంతాల్లో మొహరించిన పోలీస్ బలగాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  విద్యార్థులు ,ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం జలంధర్, వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.