కొంతన్​పల్లి శివారులోని అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్రు..

కొంతన్​పల్లి శివారులోని అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్రు..

మెదక్​ (శివ్వంపేట), వెలుగు : మెదక్​ జిల్లా కొంతన్​పల్లి శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ లో రూ.5 కోట్ల విలువ చేసే దాదాపు ఐదెకరాల భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించగా శుక్రవారం ఫారెస్టు ఆఫీసర్లు అడ్డుకున్నారు.  అటవీ భూమిలో చెట్లు నరికినట్టు, అక్రమంగా రోడ్డు వేసినట్టు  గుర్తించారు. భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్​ ను సీజ్ చేశారు. రోడ్డును జేసీబీతో తవ్వించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్​ డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​రవికుమార్​ మాట్లాడుతూ కొంతన్​పల్లి శివారులో అటవీ భూమి కబ్జా చేస్తున్నారని గ్రామస్తుల నుంచి సమాచారం అందగానే అక్కడికి చేరుకొని ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

అక్రమంగా అటవీ భూమిలో నుంచి రోడ్డు వేయడంతోపాటు అటవీ భూమి కబ్జాకు ప్రయత్నించడంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అటవీ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా అటవీ భూమి ఆక్రమణలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై కొంతన్​పల్లికి చెందిన కొందరు దళితులు ఇటీవల శివ్వంపేట తహసీల్దార్ ఆఫీస్​ ముందు ఆందోళన చేశారు.