ఏ ఒక్క ఎంపీ సీటునూ ఆషామాషీగా తీసుకోవద్దు : సీఎం రేవంత్​రెడ్డి

ఏ ఒక్క ఎంపీ సీటునూ ఆషామాషీగా తీసుకోవద్దు : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఏ ఒక్క ఎంపీ సీటును కూడా ఆషామాషీగా తీసుకోవద్దని, కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్​ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ వేవ్​ ఉన్నదని, ఇక్కడ 14 లోక్​సభ స్థానాలను కచ్చితంగా గెలవబోతున్నట్లు తన వద్ద రిపోర్ట్​ ఉన్నదని చెప్పారు. మరింత కష్టపడితే రాష్ట్రంలో ఎంపీ సీట్లను స్వీప్​ చేయొచ్చని, జనజాతర సభతో అది స్పష్టంగా కనిపించిందని అన్నారు. గెలిచే స్థానాలను చేజార్చుకోవద్దని, రాహుల్​ను ప్రధానిగా చేసేందుకు ఉన్న ఏ ఒక్క చాన్స్​ను వదులుకోవద్దని చెప్పారు. 

తనకున్న సమాచారం, రిపోర్ట్​ ప్రకారం రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్​ బలంగా ఉన్నదని, లీడర్లు సమన్వయంతో పనిచేసుకోవాలని రేవంత్​రెడ్డి చెప్పారు. కొత్త పాత తేడా అన్న లేకుండా లీడర్లందరూ కలిసి నడువాలని, బూత్​స్థాయి వరకు కో ఆర్డినేట్​ చేసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం తన నివాసంలో వరంగల్​, సికింద్రాబాద్​ లోక్​సభ స్థానాలపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. విడివిడిగా నిర్వహించిన ఈ సమావేశాల్లో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, ఎంపీ అభ్యర్థులు దానం నాగేందర్​, కడియం కావ్య, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. పోలింగ్​ బూత్​ల వారీగా కేడర్​ను సన్నద్ధం చేసుకోవాల్సిందిగా పార్టీ నేతలకు రేవంత్​ సూచించారు. నామినేషన్ల కన్నా ముందే బూత్​ లెవెల్​ కమిటీలు వేసుకోవాలని, ఒక్కో కమిటీలో పది మంది వరకు స్ట్రాంగ్​ నేతలను నియమించుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు మీటింగ్​లను పెట్టుకుని కో ఆర్డినేట్​ చేసుకోవాలన్నారు. 

వార్​ రూమ్​లు పెట్టుకోండి..

పార్లమెంట్​ ఎన్నికల సన్నద్ధత కోసం ఎక్కడికక్కడ వార్​ రూమ్​లను ఏర్పాటు చేసుకోవాలని నేతలకు సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. బ్లాక్​, డివిజన్​, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ వార్​ రూమ్​, సోషల్​ మీడియా వార్​ రూమ్​లను సెపరేట్​గా ఏర్పాటు చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సీనియర్​ నాయకుడు కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చారని, ఆయన కూతురు కడియం కావ్య విజయం కోసం అందరూ కృషి చేయాలని సీఎం అన్నారు. లంబాడీలు, ఆదివాసీలను బీఆర్​ఎస్​ మోసం చేసిందని, వారికి కాంగ్రెస్​ ఏ విధంగా న్యాయం చేస్తున్నదో వివరించాలని, పోడు భూముల సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను చెప్పాలని ఆయన సూచించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత మిగతా నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేస్తామని నేతలతో చెప్పినట్టు తెలిసింది. ఎంపీ ఎన్నికల తర్వాత లోకల్​ బాడీ ఎలక్షన్స్​ వచ్చే అవకాశాలున్నాయని, ఈ విషయంపై లోకల్​ లీడర్లకు  ఎమ్మెల్యేలు, మంత్రులు వివరించి చెప్పాలని ఆయన సూచించినట్లు సమాచారం. లోకల్​ బాడీ ఎన్నికల్లోనూ పార్టీని విజయతీరాల దిశగా నడిపించాలన్నారు. రాజకీయ సమస్యలేవైనా ఉంటే పరిష్కరించుకోవాలని, అవి పరిష్కారం కాకుంటే తనకు చెప్పాలని నేతలకు రేవంత్​ సూచించినట్టు సమాచారం. 

అసూయతో బీఆర్​ఎస్​ ఊగుతున్నది

వంద రోజుల పాలనపై ప్రజల్లో కాంగ్రెస్​పై మంచి అభిప్రాయం ఉందని నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్​ఎస్​ ఓర్వలేకపోతున్నదని, అసూయతో గులాబీ పార్టీ ఊగుతున్నదని, అందుకే కరువుపై కేసీఆర్​ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నట్లు తెలిసింది. ప్రభుత్వం కూలిపోవాలని కేసీఆర్​ కలలుగంటున్నారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘‘కరువు పరిస్థితులకు కారణం కేసీఆరే. ఆయన హయాంలోనే కరువు పరిస్థితులు మొదలయ్యాయి. కాంగ్రెస్​పై విష ప్రచారానికి బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తున్నది. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టండి. ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా చెప్పండి’’ అని నేతలతో రేవంత్​ అన్నట్లు తెలిసింది. అంతేగాకుండా హైదరాబాద్​లో తాగునీటి కొరత రాకుండా చేపడుతున్న చర్యలనూ జనానికి వివరించాలన్నారు. ఇక, శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభపైనా సీఎం రేవంత్​ సంతోషం వ్యక్తం చేశారని, ఇదే జోష్​తో పార్లమెంట్​ ఎన్నికలకూ వెళ్లాలంటూ దిశానిర్దేశం చేశారని ఓ సీనియర్​ నాయకుడు తెలిపారు.  

హైదరాబాద్​ ప్రజలూ మనవైపే ఉన్నరు

హైదరాబాద్​ సిటీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ బలం పుంజుకుంటున్నదని నేతలతో సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ సిటీలోనూ  బీఆర్​ఎస్​ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్​వైపే సిటీ ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది పార్టీలో చేరుతున్నారని, ఇప్పటికే జీహెచ్​ఎంసీ మేయర్​ చేరారని, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీ అవుతున్నారని ఆయన చెప్పినట్లు తెలిసింది.  సికింద్రాబాద్​ సెగ్మెంట్​ పరిధిలోని, సికింద్రాబాద్​, కంటోన్మెంట్​, ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్​, అంబర్​పేట తదితర సెగ్మెంట్లలో ముస్లింలతో పాటు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారని, వారి ఓట్లపై ఫోకస్​ చేయాలని పార్టీ నేతలకు సీఎం సూచించినట్లు సమాచారం. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్​ పార్టీ చేస్తున్న పనులను ఆయా వర్గాల వారికి వివరించాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. 

కాంగ్రెస్.. ఓ మహా సముద్రం

తుక్కుగూడ సభపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: తుక్కుగూడలో జరిగిన జనజాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రమని పేర్కొ్న్నారు. అందులో తమ కార్యకర్తలు నీటి బిందువులు కాదని, పేదల బంధువులని చెప్పారు. ‘‘మా కార్యకర్తలు పోటెత్తె కెరటాలు.. పోరాడే సైనికులు. మా కార్యకర్తలు.. త్యాగశీలులు.. తెగించి కొట్లాడే వీరులు. మా కార్యకర్తలు.. జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. ఎజెండాలు నిర్ణయించే నాయకులు. తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శబ్ధమిది’’అంటూ ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌‌కు తుక్కుగూడ సభకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ జత చేశారు.

పాంచ్​ న్యాయ్​ను ఇంటింటికీ తీసుకెళ్లండి

కాంగ్రెస్​ ప్రకటించిన జాతీయ మేనిఫెస్టో ‘పాంచ్​ న్యాయ్​–పచ్చీస్​ గ్యారంటీస్​’ను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిందిగా పార్టీ నేతలకు రేవంత్​ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మేనిఫెస్టోలని అన్ని అంశాలను ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, రైతుల కోసం ప్రకటించిన హామీలను వివరించాలని, మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయంపై తెలియజేయాలని సూచించారు. అంతేగాకుండా రాష్ట్రంలో ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, త్వరలో అమలు చేయనున్న హామీల గురించి కూడా వివరించి చెప్పాలని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం

పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్‌‌లో చేరారు. హైదరాబాద్‌‌లోని తన నివాసంలో వెంకట్రావుకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావు వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావడం గమనార్హం. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది.