టాప్ లెవల్ క్రికెట్ ఆడారా?.. విమర్శకులపై సచిన్ ఫైర్

టాప్ లెవల్ క్రికెట్ ఆడారా?.. విమర్శకులపై సచిన్ ఫైర్

ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌కు మరో రెండ్రోజులే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ఒడిసిపట్టాలని భారత్, న్యూజిలాండ్‌‌లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఎలా ఉండాలనే దాని గురించి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పలు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా పుజారా గురించి సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా స్ట్రయిక్ రేట్ గురించి కొందరు చేస్తున్న విమర్శలపై మాస్టర్ బ్లాస్టర్ ఫైర్ అయ్యాడు. 

‘భారత జట్టు తరఫున పుజారా ఎంతో సాధించాడు. అయితే అందరూ అతడి స్ట్రయిక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. టెస్టు క్రికెట్‌లో ప్రతిసారి స్ట్రయిక్ రేట్‌ పైనే దృష్టి పెట్టి ఆడలేం. సమయానికి తగ్గట్లు భిన్నమైన ప్లాన్‌లతో ముందుకెళ్లాలి. టీమ్ ప్లేయర్లకు సెట్ అయ్యే ప్లాన్స్‌ను కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఇకపోతే, పుజారా ఎంతో విలువైన ఆటగాడు. చేతిలో ఐదు వేళ్లు ఉంటే ప్రతి వేలుకు ఓ వైవిధ్యత, పని చేసే నేర్పు ఉంటుంది. అలాగే పుజారాకు కూడా ఒక రోల్ ఉంది, జట్టులో అతడు  అంతర్భాగం. అయితే చాలా మంది అతడి స్ట్రయిక్ రేట్ గురించి విమర్శలు చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా.. విమర్శకులు పుజారా లెవల్‌‌‌లో టాప్ లెవల్ క్రికెట్ ఆడలేదు. టెస్టు క్రికెట్‌లో మంచి ప్లేయర్‌గా మారాలంటే హిట్టింగ్ చేయడం కంటే కూడా ఓపిక, సహనంతో పరుగులు చేయాలన్న కసిని అలవర్చుకోవాలి’ అని సచిన్ పేర్కొన్నాడు.