సిటీలో పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులు

సిటీలో పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులు

హైదరాబాద్, వెలుగు:సిటీలో వానలు తగ్గుముఖం పట్టాక నీటి నిల్వలు పెరిగాయి. దోమలకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా అన్నిచోట్ల దోమల బెడద ఎక్కువైంది. ఇండ్లు, విద్యా సంస్థలు, షాపులు, ఖాళీ, నిర్మాణ స్థలాలు, మార్కెట్లు ఇలా ప్రతిఒక్కచోట దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్​వ్యాధులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. డెంగీ కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల, వచ్చే నెలలో డెంగీ, మలేరియా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎంటమాలజీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇందులో భాగంగా కాలనీల్లో మైక్రో లెవల్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి మస్కిటో బ్రీడింగ్ పాయింట్లను గుర్తిస్తున్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని జనానికి అవగాహన కల్పిస్తున్నారు. 

ఒక్కొక్కరికి 3 – 4 కాలనీలు 
జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలోని 4,846 కాలనీల్లో 24 వేల ఖాళీ స్థలాలు, తాళం వేసి ఉన్న ఇండ్లు 15 వేలు, 20 వేల భవన నిర్మాణ ప్రాంతాలు ఉన్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఖాళీ స్థలాలు, నిర్మాణ ప్రదేశాల్లో దోమల పెరుగుదల అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. నివారణకు మైక్రో లెవల్ యాక్షన్ ప్లాన్ తో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 4,846 కాలనీలకు 1600మంది ఎంటమాలజీ సిబ్బందిని కేటాయించారు. ఒక్కొక్కరికి 3, 4 కాలనీలు అప్పగించారు. ఈ సిబ్బంది ఆయా కాలనీల్లో వారంలో రెండు, మూడు రోజులు పర్యటిస్తున్నారు.రెసిడెన్షియల్ కాలనీల ప్రెసిడెంట్లను కలిసి కాలనీ మ్యాప్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. ప్రతి ఇంటిని విజిట్ చేసి నీటి నిల్వ ప్రాంతాలను, దోమలు పెరిగే స్థలాలను గుర్తిస్తున్నారు. మంచినీటిలోనూ లార్వా ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా, నీరు నిల్వ ఉండకుండా చూసేలా ఓనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కాలనీలతోపాటు అపార్ట్​మెంట్​సెల్లార్లు, ఫంక్షన్ హాళ్లు, స్కూళ్ల ప్రాంతాల్లో యాంటీ లార్వా స్ప్రే చేయిస్తున్నారు. 

అవగాహన కార్యక్రమాలు..
మైక్రో లెవల్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రతి ఒక్క సిబ్బంది దోమల నివారణకు ఇండ్ల డోర్లపై పోస్టర్లు అంటించడం, పాంప్లెట్లు పంచడంతోపాటు ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌లు, ఆడియో, వీడియోల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఇండ్లల్లో, శుక్ర, శనివారాల్లో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూట ఫాగింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతోపాటు చెరువుల్లో డ్రోన్‌‌‌‌‌‌‌‌ల ద్వారా యాంటీ లార్వా స్ప్రేయింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మూసీలో నాలుగైదు టీంలు ఫాగింగ్, డ్రోన్‌‌‌‌‌‌‌‌ల ద్వారా యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తున్నాయి. సీజన్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా క్రానిక్ బ్రీడింగ్ పాయింట్స్ ఏడాది పొడవునా ఉంటాయని, వాటిపై స్పెషల్​ఫోకస్​పెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఇండ్ల లోపల, బయట దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నాం. డెంగీకి కారణమయ్యే ఏడిస్ దోమలు నిల్వ ఉన్న మంచినీళ్లలోనే గుడ్లు పెడతాయి. ఇండ్లల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. కాలనీల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేస్తున్నాం. ఈనెల, వచ్చే నెలలో దోమల బెడద అధికంగా ఉంటుంది. ఈ నెల 20న వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 
- డా.రాంబాబు, చీఫ్ ఎంటమాలజిస్ట్, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ