- కామర్స్‌లోనే 21,758 మంది
- 74 కాలేజీల్లో ఒక్కరూ చేరలె
- దోస్త్ టాపర్‌కు ‘నిజాం’లో సీటు
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ఫస్ట్ ఫేజ్ సీట్లు అలాట్ మెంట్ అయ్యాయి. దోస్త్ ద్వారా డిగ్రీలో చేరేందుకు 89,572 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 65,191 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 60,436 మందికి సీట్లు కేటాయించారు. దీంట్లో అమ్మాయిలు 38,041 మంది, అబ్బాయిలు 22,395 మంది ఉన్నారు. గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో టీజీసీహెచ్ఈ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సీట్ల అలాట్మెంట్ వివరాలను వెల్లడించారు.
ఫస్ట్ ఆప్షన్ తోనే 42,014 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఈ ఏడాది కూడా కామర్స్ కోర్సు వైపే విద్యార్థులు ఆసక్తి చూపించారు. మొత్తం 30436 మంది సీట్లు పొందగా.. వారిలో 21,758 మంది కామర్స్ స్టూడెంట్లు, 15,249 మంది ఫిజికల్స్ సైన్స్, లైఫ్ సైన్సెస్ లో 11,005 మంది, ఆర్ట్స్ గ్రూపుల్లో 5,986 మంది, ఇతర కోర్సుల్లో 6,438 మంది సీట్లు పొందారు. వీరిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 58,575 మంది ఉండగా, తెలుగు మీడియం 1,552 మంది, ఉర్దూ మీడియం 309 మంది ఉన్నారు.
దోస్త్ టాపర్ వసంత్ కుమార్
ఇంటర్ మార్కుల ఆధారంగా దోస్త్ టాపర్లను ప్రకటించారు. ఇంటర్‌లో 99.60% మార్కులు పొందిన వసంత్ కుమార్ టాపర్‌గా నిలవగా, నిజాం కాలేజీలో కామర్స్ గ్రూపులో సీటు అలాట్ అయింది. రెండో టాపర్ ఆకునూరి మీనాక్షికి కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లైఫ్ సైన్సెస్ కోర్సులో, మూడో టాపర్ వి.అక్షరకు ఉమెన్స్ వర్సిటీలో సీటు దక్కింది.
6వ తేదీ వరకు రిపోర్టు చేయాలె
దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 వరకూ ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయాలని బాలకిష్టారెడ్డి తెలిపారు. అంతకు ముందు విద్యార్థులు దోస్త్ లాగిన్ లో రూ.500/రూ.వెయ్యి చెల్లించాలని సూచించారు. ఒకవేళ ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే సీటు రద్దవుతుందని చెప్పారు. సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమై, వచ్చే నెల 9 వరకూ ఉంటుందన్నారు.
సీట్లు 3.71 లక్షలు.. అలాట్మెంట్ 60 వేలు
రాష్ట్రవ్యాప్తంగా 805 డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 3,71,096 సీట్లున్నాయి. దీంట్లో ఫస్ట్ ఫేజ్‌లో కేవలం 60,436 మందికి మాత్రమే సీట్లు అలాట్ అయ్యాయి. ఏకంగా 74 కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేయలేదు. దీంట్లో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట డిగ్రీ కాలేజీ ఉండగా, మిగిలినవన్నీ ప్రైవేటు కాలేజీలే. డిగ్రీలో ఏకంగా 457 కోర్సులున్నాయి. రాష్ట్రంలో 117 సర్కారు డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 49,110 సీట్లలో 8,091 మందికి అలాట్అయ్యాయి.
గవర్నమెంట్ అటానమస్ 35 కాలేజీల్లో 38,580 సీట్లకు 18,096 మందికి, 617 ప్రైవేటు డిగ్రీ కాలేజీలో 2,59,640 సీట్లుండగా, కేవలం 23,018 సీట్లు మాత్రమే విద్యార్థులకు అలాట్ అయ్యాయి. వర్సిటీ అటానమస్ కాలేజీలు రెండు ఉండగా, వాటిలో 2,967 సీట్లకు 2,340 మందికి, వర్సిటీ కాలేజీలు నాలుగు ఉండగా, వాటిలో 3,300 సీట్లకు 3,174 మందికి సీట్లు కేటాయించారు. ప్రైవేటు ఎయిడెడ్ 24 కాలేజీల్లో 11,130 సీట్లకు 3,438 మందికి అలాట్ అయ్యాయి.
