కొత్త స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలం

కొత్త స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలం

న్యూఢిల్లీ:  స్పెక్ట్రమ్ బ్యాండ్‌‌‌‌లు,  రేడియో వేవ్స్​ పర్మిట్‌‌‌‌ల వేలం కోసం టెలికాం శాఖ ఈ వారం సెక్టార్ రెగ్యులేటర్  ట్రాయ్‌‌‌‌ని సంప్రదించే అవకాశం ఉంది. 2024లో కొన్ని స్పెక్ట్రమ్​ బ్యాండ్​లకు గడువు ముగుస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్​లో వేలాన్ని నిర్వహించాలని డాట్​ భావిస్తున్నది. 2024 సంవత్సరంలో 37 గిగాహెజ్​ బ్యాండ్  రేడియో వేవ్స్​,  టెలికాం లైసెన్స్‌‌‌‌ల వేలం కోసం డాట్​ రెండు రోజుల్లో ట్రాయ్‌‌‌‌కు సూచనలను పంపుతుంది. ఇందులో  600 మెగాహెజ్​ బ్యాండ్‌‌‌‌లోని స్పెక్ట్రమ్​తో పాటు 2022లో జరిగిన వేలంలో అమ్ముడుపోని ఫ్రీక్వెన్సీని కూడా వేలం వేసే అవకాశం ఉంది.

ప్రభుత్వం 10 బ్యాండ్‌‌‌‌లలో స్పెక్ట్రమ్‌‌‌‌ను ఆఫర్ చేయగా, 600 మెగాహెజ్​, 800 మెగాహెజ్,​  2300 మెగాహెజ్​ బ్యాండ్‌‌‌‌లలో ఎయిర్‌‌‌‌వేవ్‌‌‌‌ల కోసం బిడ్‌‌‌‌లు రాలేదు. మూడింట రెండు వంతుల బిడ్‌‌‌‌లు 5జీ బ్యాండ్‌‌‌‌ల 3300 మెగాహెజ్,​  26 గిగాహెజ్​ కోసం వచ్చాయి. అయితే 700 మెగాహెజ్​ బ్యాండ్‌‌‌‌ మునుపటి రెండు వేలాల్లోనూ (2016,  2021) అమ్ముడుపోలేదు. శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ కోసం వేలం మార్గదర్శకాలను ట్రాయ్ త్వరలో సిఫార్సు చేయాలని డాట్​ కోరుకుంటోంది. 

తద్వారా మార్చి క్వార్టర్​లో ప్లాన్ చేసిన వేలంలో దీన్ని చేర్చే అవకాశం ఉంది. అయితే శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ స్టార్‌‌లింక్‌ మాత్రం వేలంలో కాకుండా నేరుగా స్పెక్ట్రమ్‌‌‌‌ను కేటాయించాలని డిమాండ్ చేసింది. భారతి ఎయిర్‌‌‌‌టెల్,  వోడాఫోన్ ఐడియాలకు చెందిన  కొన్ని లైసెన్స్‌‌‌‌ల గడువు 2024లో ముగియనుంది. జనవరిలోగా ట్రాయ్‌‌‌‌ సిఫారసు అందితే డాట్‌‌‌‌ వేలం నిర్వహించగలుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.