కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం లబ్దిదారుల గుర్తింపు సర్వే

కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం లబ్దిదారుల గుర్తింపు సర్వే

సీఎం  కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాల్టీలో డబుల్​ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి నాలుగేండ్లు కావస్తున్నా ఇంకా లబ్ధిదారులకు ఇస్తలేరు. ఏడాది కింద లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించినా ఇంకా సర్వే కొనసాగుతూనే ఉంది. లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ పట్టణ శివారు​లోని సంగాపూర్ వద్ద  రూ.150 కోట్లతో జీ ప్లస్ విధానంలో 1,250 డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల నిర్మాణాలను నాలుగేండ్ల కింద పూర్తి చేశారు. అప్పుడే లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులు భావించారు. కానీ అదే సమయంలో  మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నుంచి  నిర్వాసితులను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓపెన్ ప్లాట్లు కోరుకున్న నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలు కల్పించేందుకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు. ఇటీవల నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరడంతో ఇండ్లు ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

దరఖాస్తులు తీసుకొని ఏడాది.. 

మున్సిపాల్టీ పరిధిలోని అర్హులైనవారి నుంచి అధికారులు గతేడాది జూన్ లో దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం1,250  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను 3,550 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హులైన వారిని గుర్తించడం కోసం ప్రత్యేక టీమ్ లతో సర్వే చేయించాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలల్లో సర్వేలు పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లను అందజేస్తామని చెప్పిన ఆఫీసర్ల మాట ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. మల్లన్న సాగర్ నిర్వాసితులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఖాళీ చేయకపోవడం ఒక కారణమైతే.. అధికారుల సర్వే ఇంకా పూర్తి కాక 
పోవడం మరో కారణమైంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే పేరిట కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుతం ఇండ్లలో ఉంటున్న నిర్వాసితులకు ఓపెన్​ప్లాట్లు త్వరగా కేటాయించి, డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను అర్హులకు అందజేయాలని పలువురు 
కోరుతున్నారు. 

రెండు నెలల్లో ఇండ్లు పంపిణీ చేస్తాం

గజ్వేల్ మున్సిపాల్టీ పరిధిలోని 1,250 డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లకు 3,550   దరఖాస్తులు అందాయి. వీటిపై  ఇప్పటికే 80 శాతం సర్వేను అధికారులు పూర్తి చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలుగా ఈ ఇండ్లను కేటాయించడంతో పంపిణీ ఆలస్యమైంది. రెండు నెలల్లో లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తాం. 
– ఎన్సీ రాజమౌళి గుప్తా, చైర్మన్, గజ్వేల్ మున్సిపాల్టీ