డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి ఎప్పుడు పోవాలే .. తాళాలు ఇచ్చినా ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి  ఎప్పుడు పోవాలే .. తాళాలు ఇచ్చినా ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి
  • గ్రేటర్​లో 69 వేల ఇండ్ల నిర్మాణం
  • నిర్మాణంలో మరో 25 వేల ఇండ్లు
  • అధికారుల తప్పిదాలతో కొందరు అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం
  • లబ్ధిదారులకు ఇచ్చిన ఇండ్ల పట్టాల్లో తప్పులు
  • ప్రభుత్వం మారడంతో తమకు ఇండ్లు వస్తాయో లేదోనని లబ్ధిదారుల ఆందోళన

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​లో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు.  ఎన్నికలకు ముందు పట్టాలు, ఇండ్ల తాళాలు అందుకున్నప్పటికీ లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించడం లేదు.  ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమకు ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లనిస్తారా? లేదా అన్న అనుమానంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.  కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  

గ్రేటర్‌‌‌‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని గత ప్రభుత్వం దాదాపు 69 వేల ఇండ్లను మాత్రమే అందించింది.  మరో 25 వేల ఇండ్ల వరకు నిర్మాణంలో ఉన్నాయి.  ఇందులో అత్యధికంగా కొల్లూర్‌‌‌‌లో 15,660 ఇండ్లను నిర్మించారు.  ఏడాది క్రితమే వీటి నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చి ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీఆర్ఎస్​ అనుకుంది. ఎన్నికల్లో గ్రేటర్ లో పరిధిలో ఆ పార్టీకి అదే విధంగా సీట్లు కూడా వచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ఎఫెక్ట్ చూపినట్లు రిజల్ట్ చూస్తే కనిపించింది.

అయితే నిర్మాణాలు పూర్తయి ఎక్కువ రోజులు అలాగే ఉంచడంతో కొన్ని రిపేర్లు కూడా చేయాల్సి ఉందని, కొన్నిచోట్ల లిఫ్ట్ లు, కరెంట్ తదితర పనులు చేయాల్సి ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని పనులు పెండింగ్‌‌లో ఉండటంతో పట్టాలు అందుకున్న వారిని ఇండ్లలోకి అనుమతివ్వడం లేదు.  ఒక్క కొల్లూర్‌‌‌‌లోనే కాకుండా గ్రేటర్‌‌‌‌లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.  పట్టాలిచ్చారన్న సంతోష పడుతున్న లబ్ధిదారులకు ఇండ్లలోకి రానివ్వకపోవడంతో తమ సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.  

అధికారుల  తప్పిదాలతో తిప్పలు....

అధికారుల తప్పిదాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల  లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.  పట్టాలు ఇచ్చినప్పటికీ కొంతమంది పట్టాల్లో తప్పులు ఉండటంతో వాటిని సరిచేసుకోడానికి ఎంఆర్వో, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  ఇంకొందరి పట్టాల్లో కులం, ఆధార్ నెంబర్, పేర్లు తదితర తప్పులు పడటంతో  ఆ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వలేదు.  కొందరికి తప్పులతో ఉన్న పట్టాలను అందించారు.  ఇండ్లలోకి మాత్రం అనుమతించడం లేదు.  పట్టాల్లో ఎస్సీలకు బదులుగా బీసీలు అని,  బీసీలకు ఎస్సీ, ఎస్టీలని పట్టాలు తయారు చేశారు.  ఆ పట్టాల్లో ఉన్న విధంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకొస్తేనే తమకు ఇండ్లు ఇస్తామని అధికారులు చెబుతుండటంతో లబ్ధిదారులు  టెన్షన్‌‌ పడుతున్నారు.  

దరఖాస్తు చేసుకున్న సమయంలో తాము పెట్టిన కమ్యూనిటీ కాకుండా ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చి తమకు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తామని అంటున్నారు.  అన్ని సరిచేసుకొని వచ్చిన తర్వాతనే ఇండ్లను అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.  తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు.  అంతలోనే  ఎన్నికలు రావడంతో డబుల్ ఇండ్ల పని పక్కన పెట్టారు.  ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.  రిజర్వేషన్ల  ప్రతిపాదికన ఇండ్లను అందించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ తప్పుల వల్ల రిజర్వేషన్లు తారుమారు అయ్యాయి. 

 కొత్త సర్కార్ పైనే కోటి ఆశలు....

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు కొత్త ప్రభుత్వంనే కోటి ఆశలు పెట్టుకున్నారు.  ఇది వరకు ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇండ్లు ఇస్తామని ఇండ్లను చేతికి ఇచ్చినట్లే  ఇచ్చినప్పటికీ ఇండ్లలోకి మాత్రం వెళ్లలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికలకి ముందు హడావిడిగా పట్టాలు పంపిణీ చేయడంతోనే పట్టాల్లో తప్పులు వచ్చినట్లు తెలిసింది.  దీంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది.  60 వేల ఇండ్లను రెండు నెలల్లో అందించినప్పటికీ  వెయ్యి మంది కూడా ఇండ్లలోకి పోలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకొని తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి త్వరగా వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.  పట్టాల్లో తప్పులు వచ్చిన వారికి సరిచేసి తిరిగి ఇచ్చేలా చూడాలంటున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న 25వేల ఇండ్లు కూడా నిర్మించి లబ్ధిదారులకు అందించాలని కోరుతున్నారు.