మ్యుటేషన్​ కాని భూములకు గుట్టుగా డబుల్​ రిజిస్ట్రేషన్!

మ్యుటేషన్​ కాని భూములకు గుట్టుగా డబుల్​ రిజిస్ట్రేషన్!

హైదరాబాద్, వెలుగుసబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ పూర్తయి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్​ కాని భూముల విషయంలో కొత్త చిక్కు వచ్చిపడింది. మ్యుటేషన్​ అప్లికేషన్​ పెండింగ్ లో ఉన్న ఇలాంటి భూములపై ధరణి పోర్టల్లో​ పాత ఓనర్ల పేర్లే కనిపిస్తున్నాయి. గత ఒకటీ రెండేండ్లలో భూమిని వేరొకరికి అమ్మిన కొందరు వ్యక్తులు.. ఇదే అదునుగా మరొకరికి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్​ చేసేందుకు స్లాట్ బుక్​ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మంచిర్యాల, ఖమ్మం జిల్లాలో వెలుగు చూశాయి. దీంతో మ్యుటేషన్​ పెండింగ్​లో ఉన్నవాళ్లు  ఆందోళనకు గురవుతున్నారు. తమకు భూమి అమ్మిన వ్యక్తుల పేర్లే ధరణిలో వచ్చాయని, వాళ్లు తమకు తెలియకుండా స్లాట్​బుక్​ చేసుకుని వేరొకరికి రిజిస్ట్రేషన్​ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఏండ్లుగా మ్యుటేషన్ల కోసం పెండింగ్​

సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసులో రిజిస్ట్రేషన్​ అయ్యాక మీ–సేవ ద్వారా అప్లై చేసుకుంటే  రూల్స్​ ప్రకారం 15 రోజుల్లో కొనుగోలుదారుడి పేరిట తహసీల్దార్​ మ్యుటేషన్​ పూర్తి చేయాలి. మ్యుటేషన్​ అప్లికేషన్ రాగానే రెవెన్యూ సిబ్బంది గ్రౌండ్​లెవెల్​లో పరిశీలించి ఆ అప్లికేషన్​ కు అప్రూవల్ ఇవ్వడమో.. రిజెక్ట్ చేయడమో చేయాలి.ఏండ్ల  తరబడి పెండింగ్​ లో పడుతున్నాయి. ఇలా భూముల రిజిస్ట్రేషన్ తర్వాత చేయాల్సిన మ్యుటేషన్లతోపాటు పట్టాదారు చనిపోతే ఆ వ్యక్తి వారసుల పేరిట చేయాల్సిన విరాసత్​ అప్లికేషన్లు కలిపి ఆగస్టు చివరి నాటికి  రాష్ట్రంలో 1,16,476  పెండింగ్​లో ఉన్నాయి. వీటిలో మీ–సేవ కేంద్రాల ద్వారా వచ్చిన మ్యుటేషన్  అప్లికేషన్లు 88,323, విరాసత్​ అప్లికేషన్లు 14,576 ఉండగా, బ్యాక్​ లాగ్​ మ్యుటేషన్​ అప్లికేషన్లు 5,766, బ్యాక్​ లాగ్​ విరాసత్​ అప్లికేషన్లు 7,811 ఉన్నాయి. దీంతో ఈ భూములకు యజమానులుగా ధరణి పోర్టల్​లో పాత ఓనర్ల పేర్లే  వస్తున్నాయి.  ఏడాది, రెండేండ్ల కింద భూమి అమ్ముకున్న సదరు వ్యక్తులు ఇప్పుడు ధర పెరిగిందనే ఆశతో మోసపూరితంగా వేరొకరికి రిజిస్ట్రేషన్​ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

అప్పటిదాకా ‘ధరణి’ని ఆపాలి

మా నాన్న వికారాబాద్ జిల్లా మరిపల్లి మండలం తుమ్మలపల్లిలో 2018లో పదెకరాలు, 2019లో మరో ఐదెకరాలు వేర్వేరు సర్వే నంబర్లలో భూమి కొన్నారు. మాకు అమ్మినవాళ్లు రిజిస్ట్రేషన్​ చేసి ఇచ్చారు. తర్వాత మ్యుటేషన్, పట్టాదారు పాస్​బుక్​  కోసం మీ –సేవ సెంటర్​లో మూడుసార్లు అప్లికేషన్​ పెట్టినా ఇప్పటివరకు మ్యుటేషన్​ చేయలేదు. పాస్​బుక్​ ఇవ్వలేదు. ధరణిలో మాకు భూమి అమ్మినోళ్ల పేర్లే వచ్చాయి. వాళ్లు వేరొకరికి భూమి అమ్ముకుంటే పరిస్థితి ఏంది?  అందుకే మ్యుటేషన్లు పూర్తయ్యే వరకు ధరణిని నిలిపివేయాలి.

– కె.దయాకర్ ​రెడ్డి, సంగారెడ్డి

ఐదు రోజుల్లో 4,525 రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి శుక్రవారం వరకు 4,525 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ధరణి  ఈ నెల రెండో తేదీన మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు 490, రెండున 523, మూడున 870, నాలుగున 1,170, ఐదో తేదీన 1,472 రిజిస్ట్రేషన్లు జరిగాయి.  శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకు ఈ పోర్టల్​ను 63 వేల మంది సందర్శించారు. వీరిలో 38,132 మంది రిజిస్టర్​​ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు10 కోట్ల77 లక్షల రూపాయలు వచ్చాయి.  ధరణి పోర్టల్​ ద్వారా మార్టిగేజ్​ డీడ్స్​, బ్యాంకు మాడ్యూల్స్, నాలా కన్వర్షన్​ అప్లికేషన్ వంటి సేవలు కూడా త్వరలో అందుబాటులో వస్తాయని సీఎస్​ వెల్లడించారు.