అర్హులు తక్కువ అభ్యంతరాలెక్కువ

అర్హులు తక్కువ అభ్యంతరాలెక్కువ

'డబుల్​' లబ్ధిదారుల లిస్టులో బయటపడుతున్న లోపాలు
అర్హులు 823.. అభ్యంతరాలు 1029
రిజెక్టు పేర్లపై రీసర్వేకు డిమాండ్​
కలెక్టర్​ నిర్ణయంపై ఆశలు

కోల్​బెల్ట్​,వెలుగు : డబుల్​ బెడ్​రూం ఇండ్ల అర్హుల ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో అర్హుల లిస్టులో ఒకే వ్యక్తి పేరు రెండు సార్లు రావడం, ఆర్థికంగా, రాజకీయంగా అండ ఉన్న వారి పేర్లు, ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగుల బంధువుల పేర్లు కూడా అర్హుల లిస్టులో రావడం చర్చగా మారుతోంది. సర్వే ఆఫీసర్లను మభ్యపెట్టి కొంతమంది లీడర్లు లిస్టులో పేర్లు రాయించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు డబుల్​ బెడ్​ రూమ్​ పొందేందుకు  అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలను ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో రిజెక్ట్​ చేసినట్టు తెలుస్తోంది

కిరాయి ఇల్లును సొంతిల్లు అని..

చిన్నపాటి గుడిసె ఉన్న వాళ్లకు పక్కా ఇల్లు ఉందని, కిరాయి ఇల్లును సొంత ఇల్లుగా రికార్డు చేసి అనర్హుల జాబితాలో పొందుపర్చినట్టు పలువురు అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ లీడర్లు చెప్పిన పేర్లను మాత్రమే అర్హుల లిస్టులో ఉంచారని, సర్వే సైతం వారి కనుసన్నల్లో నడిచిందని బీజేపీ, కాంగ్రెస్​, సీపీఐ, ఇతర సంఘాలు ఆరోపించాయి. అర్హులకు ఇండ్లు కేటాయించాలంటూ ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా అభ్యంతరాలకు ఛాన్స్​ ఇవ్వడంతో ఎనిమిది రోజుల్లో అర్హులుగా గుర్తించి ప్రకటించిన పేర్ల కన్నా అభ్యంతరాలే ఎక్కువ వచ్చాయి. 

రెండు మున్సిపాలిటీల్లో ఇండ్ల కేటాయింపుకు 823 మంది అర్హులని, 3,538 మంది అనర్హులని పేర్కొంటూ గతనెల 28న మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్​ ఆఫీస్​ల్లో లిస్టులను పబ్లిష్​ చేశారు. ఈ లిస్టులపై రెండు చోట్ల దరఖాస్తు దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 

అర్హులు 823.. అభ్యంతరాలు 1029.. 

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల కేటాయింపుకు 521 మంది అర్హులని, 1959 మంది అనర్హులనంటూ గతనెల 28న మున్సిపల్​ ఆఫీస్​ వద్ద లిస్టును పెట్టారు. ఇదే విధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లకు 302 మంది అర్హులని, 1579 మంది అనర్హులంటూ లిస్టులో పేర్కొన్నారు. గతనెల 28 నుంచి మార్చి 3 వరకు లిస్టులోని పేర్లపై అభ్యంతరాలుంటే మున్సిపల్​ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అయితే ఇండ్ల ఎంపిక కోసం రెవెన్యూ ఆఫీసర్లు పబ్లిష్​ చేసిన లిస్టులపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ స్పందించారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రదర్శించిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల జాబితా ఫైనల్​ లిస్ట్​ కాదని పేర్కొన్నారు. మొదటి విడతలో దరఖాస్తు చేసుకొని జాబితాలో పేరులేని అర్హత కలిగిన వాళ్లు సంబధిత సర్టిఫికేట్లతో మున్సిపల్​ ఆఫీస్​ల్లో మార్చి 6 వరకు సంప్రదించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులపై జిల్లా ఆఫీసర్లతో ఎంక్వయిరీ జరిపించి, అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారు. అన్ని అర్హతలు ఉండి రిజెక్ట్​ లిస్టులో పేర్లున్న వారు కలెక్టర్​ హామీపై నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 823 మంది అర్హులుగా లిస్టులో పేర్కొంటే ఎనిమిది రోజు వ్యవధిలో మందమర్రి మున్సిపాలిటీలో 619 మంది, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 410 మంది అభ్యంతరాలను ఆఫీసర్లకు అందించారు. మరికొంత గడువు ఇవ్వాలని దరఖాస్తు దారులు డిమాండ్​ చేస్తున్నారు. 

కట్టింది తక్కువ అప్లికేషన్లు ఎక్కువ

పేద కుటుంబాలకు సర్కార్​ కట్టించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు లెక్క కుదరడంలేదు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కట్టిన ఒక్కో ఇంటి కోసం ఐదు, ఆరు కుటుంబాలు పోటీ పడుతున్నాయి. కట్టిన ఇండ్లు తక్కువ..వచ్చిన అప్లికేషన్లు ఎక్కువ కావడంతో ఇండ్ల కేటాయింపులో ఆలస్యం జరుగుతుంది. లాటరీ పద్దతిలో ఇండ్లను మంజూరు చేయడానికి ఆఫీసర్లు వెనుకాడుతున్నారు. ఇండ్ల కోసం పోటీ బాగా ఉండడంతో పాటు పొలిటికల్​ ప్రెషర్​ కూడా ఇందుకు కారణమంటున్నారు. మందమర్రి మున్సిపాలిటిలో 400 డబుల్​ బెడ్​ ఇండ్ల నిర్మాణం పూర్తికాగా మరో 160 ఇండ్ల పనులు సాగుతున్నాయి. ఇక్కడ ఇండ్ల కోసం 2480 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 286 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా వీటి కోసం సుమారు 2వేలకు పైగా దరఖాస్తులు ఇచ్చారు.