డీపీఎంలకు ఒక్కో జిల్లాలో ఒక్కోలా జీతాలు

డీపీఎంలకు ఒక్కో జిల్లాలో ఒక్కోలా జీతాలు

హైదరాబాద్ :  కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఇ– పంచాయత్ మిషన్ లో పని చేస్తున్న డీపీఎం (డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్), ఎస్పీఎం(స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్)లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆఫీసర్లు ఇష్టారీతిగా జీతాలు కట్ చేస్తున్నారు. డీపీఎంలకు ఒక్కో జిల్లాలో ఒక్కోలా జీతాలు ఇస్తున్నారు. ఆర్జీఎస్ఏ (రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్)లో భాగంగా 32 జిల్లాల్లో పని చేస్తున్న డీపీఎంలకు  ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున, రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న ఎస్పీఎంలకు రూ.60 వేల చొప్పున గ్రాంట్ ను కేంద్రం విడుదల చేస్తోంది. అయితే, ఏ జిల్లాలో అయినా.. హోదా, పని ఒక్కటే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కోలా జీతాలు ఎలా ఇస్తారని డీపీఎంలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ అధికారులు తమ జీతాలను కట్ చేయగా వచ్చిన డబ్బులను ఆఫీస్ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏవేవో కారణాలు చూపుతూ.. కొంతమంది డీపీఎంలకు రూ. 22 వేలు, మరికొందరికి రూ. 34 వేలు ఇస్తున్నారని, ఎస్పీఎంలకు రూ. 50 వేలకు మించి ఇవ్వడంలేదని అంటున్నారు. ఇదే మిషన్ కింద డీఆర్డీఏలో పనిచేస్తున్న డీపీఎంలకు రూ.40 వేలతో పాటు వెహికల్ సౌలతు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు.  

జీవో ఇచ్చినా.. జీతాలు పెంచలే 
ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చిన టైమ్ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచాలని జీవో ఇచ్చారని, ఇప్పటికీ ఇది అమలు కావడంలేదని డీపీఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇ–పంచాయతీలో సెంట్రల్, స్టేట్ స్కీమ్ ల అమలుకు సంబంధించి ఆన్ లైన్ అప్లికేషన్లను అప్ డేట్ చేస్తూ, ప్రతి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆన్లైన్ అంశాలపై ట్రైనింగ్, అవేర్ నెస్ కల్పించటం, టెక్నాలజీ అంశాలపై రిపోర్టులు ఇవ్వడం వంటి విధులను డీపీఎంలు నిర్వర్తిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ల నుంచి స్కీమ్ ల అమలుపై రిపోర్టులు తీసుకొని పంచాయతీ రాజ్ కు, ప్రభుత్వానికి డీపీఎంలు, ఎస్పీఎంలు అందిస్తున్నారు. ఈ ఏప్రిల్ లో నేషనల్ పంచాయతీ రాజ్ డే సందర్భంగా రాష్ట్ర ఇ–పంచాయతీ విభాగానికి జాతీయ అవార్డు కూడా వచ్చిందని, అయినా తమను చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు.