త్యాగానికి ప్రతిరూపం రమాబాయి అంబేద్కర్

త్యాగానికి ప్రతిరూపం రమాబాయి అంబేద్కర్

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి. ఆమె1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్రలోని "ధబోల్" గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి భికు ధోత్రే (వాలంకర్), తల్లి రుక్మిణి చిన్న వయసులోనే మరణించారు. మాతా రమాబాయికి అంబేద్కర్​తో బాల్యంలోనే వివాహం జరిగింది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విధేయత గల జీవిత భాగస్వామిగా ఆదర్శప్రాయంగా జీవించింది. అంబేద్కర్ ఎంత ఎత్తుకు ఎదిగినా తన ఉన్నతిలో భాగం కాలేకపోయినది. చివరివరకూ కష్టాల కడలిలో సాధారణ జీవితాన్నే గడిపింది. భర్త ఉన్నత విద్యకు ఎంతో ఆసరాగా నిలిచింది.  

అంబేద్కర్​ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడుతున్నప్పుడు ఆయనకు అండగా నిలిచిన ఆదర్శ మహిళ. త్యాగానికి ప్రతిరూపం. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం రమాబాయి అంబేద్కర్. ఆమె ఓర్పు, విధేయత, వినమ్రతతో  ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను తీర్చిదిద్ది ఈ దేశానికే దీపమయ్యారు. కళ్లముందు కడుపున పుట్టినోళ్లు కూలిపోతున్నా.. చెక్కు చెదరని ఆమె ధైర్యం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం. 

ఒంటరి పోరాటం

భర్త ఉన్నత చదువుల కోసం దూరంగా ఉన్నా... ఆమె చేసిన ఒంటరి పోరాటం ప్రతి మహిళకు ఒక చక్కని పాఠం. అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు రమాబాయి ఇంటిని నడిపేది. ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉండి కూడా తన భర్తకు డబ్బులు పంపడానికి పేడ ఎత్తి పిడకలు అమ్మిన ధైర్యశాలి. మనకోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేద్కర్ అయితే...ఆ మహనీయుడి కష్టాల్లో సమానంగా పాలుపంచుకొని ఆయన విజయం వెనుక నిలిచిన మహిళ రమాబాయి.

మన  బిడ్డల భవిష్యత్తు కోసం తను నవ మాసాలు మోసి కన్న బిడ్డలను త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి.  మే 27, 1935న, రమాబాయి తన 37వ ఏట ముంబైలోని దాదర్‌లో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించింది. ఆమె త్యాగానికి మనమందరం రుణపడి ఉన్నాం. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో రమాబాయి పాత్ర చాలా ప్రభావవంతమైనదని, అతని నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడిందని అన్నారు. తన "థాట్స్ ఆన్ పాకిస్థాన్" అనే పుస్తకంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రమాబాయి తనకు ఎలా అండగా నిలిచారో రాశారు. 

రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకం

నేటి ఆధునిక యుగంలో అనేక సదుపాయాలు ఉండి, సంతృప్తిగా జీవించలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.  కుటుంబం పట్ల స్వార్థం పెరిగిపోతున్నది. మరోవైపు కలహాలతో కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదర్శ దంపతులైన రమాబాయి- అంబేద్కర్ జీవితం మనందరికీ ఒక పాఠంగా నిలవాలి. సామాజిక మార్పు కుటుంబం నుంచే మొదలవుతుంది. ప్రతి కుటుంబం కూడా వ్యక్తిగత జీవితంతోపాటు మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి. అప్పుడే ఆదర్శ దంపతులకు అర్థం. మహిళా లోకం రమాబాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి పురుషుడు కూడా మహిళా సేవలను అర్థం చేసుకొని తగిన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. అంబేద్కర్  కొడుకు చనిపోయినప్పుడు ఆయన చేతిలో చిల్లిగవ్వ లేదు.

ALSO READ:  దక్షిణ కాలిఫోర్నియాలో భీకర తుఫాను.. రాష్ట్రమంతా అతలాకుతలం

ఆ పరిస్థితిని చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పిన తమ కుటుంబ పరిస్థితిని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన గొప్ప మాతృమూర్తి. ఈ రోజున రాజ్యాంగం హక్కులు అట్టడుగు, అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అది ఆమె జీవితకాల కష్టమే. భారత ప్రభుత్వం మాతా రమాబాయి త్యాగశీలతను భారతీయ సమాజానికి పరిచయం చేయాలి. ఈ క్రమంలో 30 మే 2018న మహారాష్ట్రలోని పూణేలో రమాబాయి అంబేద్కర్ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీద ఆవిష్కరించి స్మరించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమె జీవితాన్ని విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా బోధించాలి.  రమాబాయి  జయంతిని ప్రత్యేక రోజుగా నిర్వహించుకోవాలి. 

సంపతి రమేష్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్