
శివుని శిరస్సు నుంచి గంగ జాలువారినట్టి.. ఆయన కలం నుంచి అక్షరాలు జాలువారేవి. మహా మహా పండితుల నుంచి మామూలు పామరుల వరకు ప్రతి ఒక్కరినీ అలవోకగా అల్లుకుపోయేవి. పాఠకులు, శ్రోతల హృదయాలు ఆ సాహితీ ఝరిలో తడిసి ముద్దయ్యేవి. కవితా మాలికలతోనే కాదు.. రసరమ్య సినీ గీతాలతోనూ ప్రతి తెలుగువాడినీ తన అభిమానిగా మార్చేసుకున్న ఆ కవి.. డాక్టర్ సి.నారాయణరెడ్డి. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా సినారె సినీ సాంగత్యం గురించి కొన్ని విశేషాలు..
సినారె కవిత్వమంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టం..
కరీంనగర్ జిల్లా, హనుమాజీ పేట గ్రామంలో జన్మించారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. వీధి నాటకాలు చూసి తెలుగుపై ప్రేమను పెంచుకున్నారు. బీఏ వరకు చదువుకున్నది ఉర్దూ మీడియమ్‌లో అయినా.. మనసు మాత్రం తెలుగు మీదే. అందుకే తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. తెలుగు లిటరేచర్‌పై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ కూడా పొందారు. జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి, కర్పూర వసంత రాయలు, విశ్వనాథ నాయుడు, నాగార్జున సాగరం లాంటి రచనలతో సాహితీ ప్రియుల్ని అలరించారు. సినారె కవిత్వమంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీకి రమ్మని ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. దాంతో ‘గులేబకావళి కథ’ చిత్రం కోసం ‘నన్ను దోచుకుందువటే’ పాట రాసి సినీ పరిశ్రమలో తన తొలి ముద్ర వేశారు సినారె. ఆ పాట అప్పట్లో పెద్ద హిట్. ఇప్పటికీ ఎందరికో ఫేవరేట్. మదనా సుందరా, ఒంటరినైపోయాను, సలాం వలేకుం సాయిబుగారూ, కలల అలలపై తేలే మనసు పాటలు కూడా ఆయనే రాశారు.
ఒక్క పాటయినా రాయించుకోవాలని..
మొదటి సినిమాతోనే సినారె సాహిత్యానికి తెలుగు సినీ ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. దర్శకులంతా ఆయన కోసం క్యూ కట్టారు. ఆయనతో ఒక్క పాటయినా రాయించుకోవాలని తపన పడేవారు. అందుకోసం సినిమాల్లో కొన్ని సందర్భాలను సృష్టించుకునేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల సినిమాల్లో సినారె పాట ఉండాల్సిందే. ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణ, హరనాథ్ లాంటి హీరోలకూ రాశారు సినారె. కె.విశ్వనాథ్ అయితే తన ప్రతి సినిమాలోనూ ఆయనతో పాట రాయించేవారు.
పదునైన పదాలతో విలువైన పాటలు..
తెలుగు సినిమా పాటకి కొత్త నడకలు నేర్పిన కవి సినారె. హాస్యం, తత్వం, ప్రేమ, శృంగారం, విరహం, విషాదం, భక్తి, రక్తి.. జానర్ ఏదైనా పదునైన పదాలతో విలువైన పాటల్ని వెలువరించారాయాన. రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరబాద్, ఆడవే మయూరీ, గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి, పగలే వెన్నెల జగమే ఊయల, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం, చదువురాని వాడవని దిగులు చెందకు, దాచాలంటే దాగదులే, వగలరాణివి నీవే, ఆనాటి హృదయాల ఆనందగీతం, శివరంజనీ నవరాగిణీ.. చెప్పుకునే కొద్దీ ఇలాంటి అద్భుతమైన గీతాల జాబితా పెరుగుతుందే తప్ప తరగదు.
ఎన్టీఆర్‌తో సినారెకి గొప్ప అనుబంధం..
చాలామంది హీరోల సినిమాలకి వర్క్ చేసినా ఎన్టీఆర్‌తో సినారెకి గొప్ప అనుబంధం ఉండేది. అందుకే ఆయన సినిమాలన్నింటికీ ఆయన పని చేస్తుండేవారు. ఇప్పటికీ ఏదైనా కార్యక్రమానికి వెల్‌కమ్ సాంగ్ అవసరమైతే ‘శ్రీకృష్ణపాండవీయం’ కోసం సినారె రాసిన ‘స్వాగతం సుస్వాగతం’ పాటను వాడుతుంటారు. ‘దాన వీర శూర కర్ణ’ లోని జయీభవ విజయీభవ పాట కూడా అంతే పాపులర్. తెలుగు జాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది లాంటి పాటలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. చండశాసనుడు, అక్బర్ సలీమ్ అనార్కలి, తాతమ్మ కల, సామ్రాట్ అశోక, చాణక్య చంద్రగుప్త, బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి ఎన్టీఆర్ సినిమాలెన్నింటికో సినారె పాటలు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
ట్రెండ్‌కి అనుగుణంగా పాటలు రాయడం ఆయనకే చెల్లింది
కవిగా ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్న సినారె.. సినీ గేయ రచయితగా మాత్రం చాలా ఆలస్యంగా అవార్డులు అందుకున్నారు. ఎప్పటి నుంచో పాటలు రాస్తున్నా.. నంది అవార్డు కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమించు’ మూవీలోని ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా’ పాటకు మొదటిసారి నందిని గెల్చుకున్నారు. ఆ తర్వాత ‘సీతయ్య’ చిత్రంలోని ‘ఇదిగో రాయలసీమ గడ్డ’ పాటకి కూడా నందిని అందుకున్నారు. దాదాపు మూడు వేలకు పైగా సినిమా పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. కాలానికి, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా పాటలు రాయడం ఆయనకే చెల్లింది. ‘అరుంధతి’ సినిమాలోని జేజమ్మ పాట అందుకు ఉదాహరణగా నిలిచింది. తన చివరి పాటను ‘మనసైనోడు’ మూవీ కోసం రాశారు సినారె. ఆ పాటను ఆయనకే అంకితమిచ్చింది టీమ్. 2017, జూన్ నెలలో సినారె అనారోగ్యంతో కన్ను మూయడంతో సినీ రంగంలో ఓ స్వర్ణయుగం ముగిసింది. నిప్పు కణికల్లాంటి నిజాలను, మంచు పవనాల వంటి హాయైన మధురిమలను సమానంగా పంచిన ఆయన పాట నాటితో మూగబోయింది. కానీ ఆ పదాల రుచిని నేటినీ ప్రేక్షకలోకం ఆస్వాదిస్తూనే ఉంది. సినారె పాట.. ప్రతి ఒక్కరి చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.