కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డు కాదు

కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డు కాదు

కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ  ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య.. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్‌ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని మోడీ ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ఈ ప్రస్తావన చేశారు.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేమల గ్రామంలో 1938 జూలై 9న జన్మించిన విఠలాచార్యకు చిన్న తనం నుంచి పుస్తక పఠనంపై చాలా ఆసక్తి ఉండేది. చదువుకునే వయసు నుంచి ఆయనకు పెద్ద లైబ్రరీ పెట్టాలన్నది ఒక కల. ఇందుకోసం ఆయన చదువుకునే సమయంలోనూ పుస్తకాల సేకరణ చేసేవారు. లైక్చరర్, ప్రిన్సిపాల్‌గా పని చేసి రిటైర్‌‌ అయిన ఆయన తాను నివాసం ఉంటున్న ఎల్లంకి గ్రామంలో 2014లో 4 వేల పుస్తకాలతో లైబ్రరీ స్టార్ట్ చేశారు. అయితే  కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి లైబ్రరీ మొదలుపెట్టినప్పటికీ దానిని నడపలేకపోయారు. అయినా నిరుత్సాహ పడకుండా సొంతంగా పుస్తకాలు సేకరిస్తూ వచ్చి.. తన కలను నిజం చేసుకున్నారు. ‘ఆచార్య కూరెళ్ల గ్రంధాలయం’ అన్న పేరుతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గ్రంధాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. కాగా, ఆయన దాదాపు 20 పుస్తకాలు కూడా రాశారు.

9 నుంచి 12వ తరగతి పిల్లలకు పోటీ..

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో దేశానికి చెందిన మొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌ను కోల్పోవడం దురదృష్టకరమని మోడీ అన్నారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే మరణంతో చాలా రోజులు పోరాటం చేశారని, చివరకు ఆ పోరాటంలో ఓడిపోయారని తెలిపారు. అలాగే 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామాన్ని స్మృతికి తెచ్చేలా సజీవంగా నాటి దృశ్యాలను కళ్లకు కట్టిన లక్నో డ్రోన్‌ షోను మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక ప్రతి ఏటా తాను నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ఈ సారి కూడా చేపడతానని, ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 12వ తరగతి పిల్లలకు ఒక ఆన్‌లైన్ కాంపిటీషన్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే విద్యార్థులు డిసెంబర్ 28 నుంచి mygov.inలో రిజిస్టర్ చేసుకోవచ్చని అన్నారు. కాగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ప్రతి పౌరుడి పాత్ర కూడా ముఖ్యమేనని మోడీ చెప్పారు.