చావు రాకూడదనుకుని మరణించారు... మితి మీరిన ఆత్మవిశ్వాసం ఉంటే జరిగేది ఇదే..!

చావు రాకూడదనుకుని మరణించారు... మితి మీరిన ఆత్మవిశ్వాసం ఉంటే జరిగేది ఇదే..!

 సంజయుడు ధృతరాష్ట్రుడి అనుజ్ఞమేరకు పాండవుల దగ్గరకు వెళ్లి, ఆయన చెప్పమన్న మాటలను చెప్పాడు. అది సంజయ రాయబారం. ఆ తరువాత పాండవులు చెప్పమన్న మాటలను చెప్పడానికి వెనుకకు మరలి వచ్చి, ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఆ సందర్భంలో దుర్యోధనుడు, కర్ణుడు మితిమీరిన అహంకారంతో, తమను ఎవ్వరూ ఎదిరించలేరని విర్రవీగుతూ బీరాలు పలికారు. 

అప్పుడు సంజయుడు –జ్ఞాతులైనవారు తమలో తాము ఇలా పోరాడుకోవటం తగదు. ఒకరితో ఒకరు కలిసి భోజనాదులు చేస్తూ, సత్కరించుకుంటూ, సత్ప్రవర్తనతో మెలగటం మంచిది.. అని పలికాడు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన కలిగే అనర్థం గురించి ఒక కథ చెప్పాడు. 

‘‘నేను ఒకసారి ఒక పర్వత ప్రాంతానికి వెళ్లాను. అక్కడ దుర్గమమైన ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశం మీద ఒక తేనె పట్టు ఉంది. ఆ తేనెను సేవిస్తే మరణం ఉండదని పెద్దలు చెప్పారు’ అని అక్కడ ఉన్న కొందరు వారిలో వారు మాట్లాడుకున్నారు. ఆ తేనె కోసం వారు ముందువెనుకలు ఆలోచించకుండా వేగంగా ఆ తేనె పట్టు మీదకు ఉరికారు. ఆ తేనెటీగలు కుట్టడంతో కళ్ళు కనపడక వారు పక్కనే ఉన్న లోయలో పడి మరణించారు.

దీని తేనియ త్రావిన మానవులకు 
జరయు రుజయును డప్పియు జావు గలుగ
ననగ గొందరు బోయలు విని కడంగి
యుఱక మొఱకులై చఱి బడ నుఱికిరపుడు
(మహాభారతం, ఉద్యోగ పర్వం,ద్వితీయాశ్వాసం, 277)

అసలు చావే ఉండదని దురాశతోటి తేనె కోసం అర్రులు చాచి, చాలా ముందుగానే మరణించారు. అందుకే మనలను పాండవులు ఓడించరనే మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడద’’ని సంజయుడు పలికాడు. కానీ, అహంకారంతో కన్నుమూసుకుపోయిన దుర్యోధనాదులకు ఆ మాటలు వినిపించలేదు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల అస్త్రశస్త్రాలకు పదకొండు అక్షౌహిణీల సేనతో కలిసి కౌరవులు, కురువృద్ధులు కూడా మరణించారు.

►ALSO READ | ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఆడియన్స్ కు ఫుల్ పండగే

భస్మాసురుడి కథ తెలిసినదే. తను ఎవరి తల మీద చేయి ఉంచితే వారు మరణించాలని శివుడిని వరం కోరాడు. శివుడు వరమిచ్చాడు. ఆ వరాన్ని పరీక్షించాలనుకుని శివుని నెత్తి మీద చెయ్యి పెట్టాలని చూశాడు భస్మాసురుడు. జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి, భస్మాసురుడిని తన వైపుకు తిప్పుకున్నాడు. తాను చేసినట్లు చేయమని భస్మారుడిని సమ్మోహపరిచి నాట్యం చేయసాగింది జగన్మోహిని. అలాగే చేశాడు భస్మాసురుడు. కొద్దిసేపటికి తన చేతిని తన తల మీద ఉంచుకుంది జగన్మోహిని. ముందువెనుకలు ఆలోచించకుండా భస్మాసురుడు తన చేతిని తన తల మీద ఉంచుకున్నాడు. అంతే.. భస్మమైపోయాడు. ఇతరుల తల మీద పెడితే వారు చావాలని కోరుకున్న భస్మాసురుడు, ఆ వరాన్ని తన పాలిటి శాపం చేసుకున్నాడు. 

చీమ కథ తెలిసిందే.. ఒకసారి ఒక చీమ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసింది. ‘తాను ఎవరిని కుడితే వారు కుట్టిన వెంటనే చనిపోవాలి’ అని బ్రహ్మదేవుడిని వరం కోరాలనుకుంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆనందంలో, ‘నేను కుట్టగానే చనిపోవాలి’ అనేసింది. బ్రహ్మ ‘తథాస్తు’ అన్నాడు. అంతే ఆ నాటి నుండి చీమ మనలను కుట్టగానే అది చచ్చిపోతోంది. 

మరో కథ.. 

అనగనగా గ్రీసు దేశంలో ఒకప్పుడు మిడాస్‌‌ అనే రాజు ఉండేవాడు. అతడికి కావలసినంత సంపద ఉంది. దానితో పాటు ఒక అందమైన కూతురు కూడా ఉంది. అతడికి బంగారం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అనుకోకుండా ఒక దేవత ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరకోమంది. మిడాస్‌‌ చాలాసేపు ఆలోచించి, ‘నేను ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారాలి‘ అని కోరుకున్నాడు. ఆవిడ వరమిచ్చి, అంతర్థానమైంది. తనకు కావలసినంత బంగారం వస్తుందని సంబరపడ్డాడు మిడాస్‌‌. కానీ, ఆ వరం తన పాలిటి శాపంగా మారింది. ఆహారం తినడానికి ప్రయత్నించగా ఆ ఆహారం బంగారంగా మారిపోయింది.

 పోనీ పండ్లు తిందామనకున్నాడు. అవి కూడా బంగారంగా మారిపోయాయి. మంచినీళ్లు తాగి కడుపు నింపుకుందామనుకున్నాడు. నీళ్లను తాకగానే అవి కూడా బంగారంగా మారిపోయాయి. ఆకలిదప్పుల బాధకు తట్టుకోలేక.. తన కూతురిని కౌగిలించుకుని బావురుమన్నాడు. అంతే ఆమె కూడా బంగారపు బొమ్మగా మారిపోయింది. తాను ఎంత పొరపాటు చేశాడో రాజు తెలుసుకుని, తనను క్షమించి, ఆ వరాన్ని తిరిగి తీసేసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. 

ఆవిడ కరుణించి, ‘నదిలో ముఖం కడుక్కో. నువ్వు మామూలు మనిషివి అయిపోతావు’ అని పలికింది. మిడాస్‌‌ నదిలోని నీటితో ముఖం కడుక్కున్నాడు. మామూలు మనిషి అయిపోయాడు. తన తప్పు తెలుసుకున్నాడు.

దుర్యోధనుడు మాత్రం పట్టిన పట్టు విడువకుండా పాండవులతో యుద్ధం చేశాడు. వంశనాశనానికి కారకుడయ్యాడు.

- డా. పురాణపండ వైజయంతి-